బొగ్గు కాలిపోతోంది..సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో మంటలు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం ఏరియాలో కొత్తగా ప్రారంభించిన ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లో వెలికితీత సమయంలో బొగ్గు కాలిపోతోంది. దీంతో విషవాయువులతో కార్మికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బొగ్గు మండిపోవడంతో సంస్థకు సైతం నష్టం వాటిల్లుతోంది. సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో 12 ఏండ్ల క్రితం మూసివేసిన జీడీకే 5ఏ అండర్ గ్రౌండ్ మైన్, మూడేండ్ల క్రితం మూసివేసిన జీడీకే 5వ అండర్ గ్రౌండ్ మైన్‌ను కలిపి ఓపెన్ కాస్ట్ 5 పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బొగ్గు వెలికితీయడం ప్రారంభించారు. సుమారు 300 మీటర్ల లోతులో నుంచి జి ‒ 8 గ్రేడ్ రకం బొగ్గును వెలికితీస్తున్నారు. రూ.471.19 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయగా, ఇందులో మొత్తం 33.24 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఈ ఓపెన్ కాస్ట్‌లో 15 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు.
నిప్పుల కుంపటి
గోదావరిఖని పట్టణానికి అతి సమీపంలో గల ఓపెన్‌కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లో నిత్యం మంటల చెలరేగి విలువైన బొగ్గు అగ్నికి ఆహుతి అవుతూ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అండర్ గ్రౌండ్ మైన్లకు చెందిన పాత పనిస్థలాలలోని గులాయిలో గ్యాస్ తయారై ప్రస్తుతం బొగ్గు వెలికితీస్తున్న చోట ఆక్సిజన్‌తో జతకలిసి మంటలు లేస్తున్నాయి. పెద్దఎత్తున పొగ వ్యాపిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న జి‒8 గ్రేడ్ రకం బొగ్గును విద్యుత్ పరిశ్రమలకు రవాణా చేస్తుంటారు. అయితే నిత్యం బొగ్గు కాలుతుండడం వల్ల బొగ్గును జి‒ 10 గ్రేడ్ కు తగ్గించి రవాణా చేస్తుండడంతో సంస్థకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. ఓసీపీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు మూడు లక్షల టన్నుల బొగ్గు ఆగ్నికి ఆహుతి అయినట్టు అంచనా వేస్తున్నారు. బొగ్గు మండుతుండడం వల్ల వెలువడే విషవాయువులతో ఓసీపీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఓసీపీలోని పనిస్థలంలో 8 గంటలు పనిచేసే కార్మికులను నాలుగు గంటల చొప్పున పనిచేసేలా మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంది. అలాగే కాలుతున్న బొగ్గును ఓవర్ బర్డెన్ (మట్టి)తో కలిపి ఓబీ కుప్పల్లో పారబోస్తున్నారు. నిత్యం ఓసీపీ నుంచి వచ్చే పొగతో చుట్టుపక్కల ఉన్న పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రక్షణ చర్యలు శూన్యం
అండర్ గ్రౌండ్ మైన్లలో ఉన్న బొగ్గును వెలికితీసే క్రమంలో పాత గులాయిలను ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే మంటలను అదుపు చేసేందుకు నిత్యం నీళ్లు చల్లించాలి. కానీ ఇందుకు అనుగుణంగా మేనేజ్‌మెంట్ తగిన చర్యలను చేపట్టలేదు. కొందరు ఉద్యోగులతో కాలుతున్న బొగ్గుపై నామమాత్రంగా పైపులతో నీళ్లు చల్లిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో మంటలను ఆర్పలేకపోతున్నారు. కాలుతున్న బొగ్గును నేరుగా డంపర్‌లో పోసుకుని సీహెచ్‌పీలలోని బంకర్లలో నింపుతున్నారు. దీనివల్ల ఇటీవల సీహెచ్‌పీలో 20 మీటర్ల మేర బెల్ట్ కాలిపోయి తెగిపోవడంతో నాలుగు గంటలపాటు బొగ్గు రవాణా నిలిచిపోయింది.