కార్మికుల పింఛన్​కు కోలిండియా సాయం.. టన్ను బొగ్గుపై అదనంగా రూ.10 చొప్పున చెల్లించాలని నిర్ణయం

కార్మికుల పింఛన్​కు కోలిండియా సాయం.. టన్ను బొగ్గుపై అదనంగా రూ.10 చొప్పున చెల్లించాలని నిర్ణయం

కోల్​బెల్ట్, వెలుగు: బొగ్గు గని కార్మికులకు చెల్లిస్తున్న పెన్షన్​ఫండ్​కు కోలిండియా యాజమాన్యం తన వంతు సహకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న నిధులతో మరో ఆరేండ్ల వరకు పింఛన్ చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత చేయాల్సిన చెల్లింపులపై సందిగ్ధత నెలకొన్న క్రమంలో తాము ఉత్పత్తి చేస్తున్న ప్రతి టన్ను బొగ్గుకు మరో రూ.10చొప్పున కోల్​మైన్స్​ప్రావిడెంట్​ఫండ్​ ఆర్గనైజేషన్​(సీఎంపీఎఫ్ఓ)కి జమ చేయనున్నట్లు కోలిండియా యాజమాన్యం పేర్కొంది.

ఈ నిర్ణయంతో పెన్షన్​ ఫండ్​ పెరగడంతో పాటు మరికొంత కాలం నిరాటకంగా రిటైర్డు ఉద్యోగులకు పింఛను చెల్లించే వెలుసుబాటు కలగనుంది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న సంఘాలు, రిటైర్డు ఉద్యోగులు సింగరేణిలోనూ అదనపు చెల్లింపు చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తున్నారు.

జమ తక్కువ.. చెల్లింపులు ఎక్కువ..
పెన్షన్​ఫండ్​కి ఏటేటా జమ అయ్యే సొమ్ము కన్నా, చెల్లింపులు అధికం అవుతున్నాయని ఇటీవల కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ రిలీజ్​చేసిన లెక్కలు చెబుతున్నాయి. కోలిండియా, సింగరేణి సంస్థలో గతంతో 10 లక్షల మంది కార్మికులు పనిచేశారు. ప్రస్తుతం వారి సంఖ్య 2.5లక్షలకు పడిపోయింది. కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు.

రిటైర్డ్ అయినవారే ఎక్కువగా ఉండడంతో పాటు నెల నెలా పింఛన్ చెల్లింపులతో ఫండ్​తగ్గిపోతుంది. మరో ఆరేండ్ల తర్వాత కోల్ ఇండియా పెన్షన్ చెల్లించే స్థితిలో ఉండదు. ఇప్పటికే పెన్షన్ ఫండ్ లోటు పెరుగుతోంది.  ఇందులో కోలిండి యా పరిధిలో 6,24,000 మంది, సింగరేణిలో 84,530 మంది రిటైర్డు ఉద్యోగులున్నా రు.  ప్రస్తుతం 7.8 లక్షల మంది రిటైర్డు కార్మికులకు ఏటా రూ.5,250 కోట్ల వరకు పెన్షన్​ చెల్లిస్తున్నారు. కాగా.. 1998లో కేంద్ర కార్మికశాఖ మంత్రి కాకా వెంకటస్వామి కోల్​మైన్స్​ పెన్షన్​ స్కీమ్ ను అమల్లోకి తెచ్చారు.  

అదనంగా మరో రూ.10 జమకు కోలిండియా నిర్ణయం 
సీఎంపీఎఫ్​ ఫండ్​లోటు నేపథ్యంలో హైదరాబాద్​లో గత జనవరి 17న   కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి,  కోలిండియా, సింగరేణి యాజమాన్యాలు, సీఎంపీఎఫ్​ ట్రస్టు బోర్డు సభ్యులు సమావేశమై .. పింఛన్ నిధిని పెంచే మార్గాలపై చర్చించాయి. ప్రస్తుతం టన్నుకు రూ.10 చెల్లిస్తుండగా, అదనంగా మరో రూ.10 చెల్లించాలని నిర్ణయించారు.

మరోవైపు కోలిండియా ఏటా సుమారు 100 కోట్ల టన్నులు బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా.. ఇందులో సింగరేణి వాటా ఏటా 70 మిలియన్​ టన్నులకు పైగా ఉంది. అదనంగా టన్నుకు రూ.10 జమ చేస్తూ కోలిండియా నిర్ణయాన్ని సింగరేణి కూడా అమలు చేయాల్సి ఉంటుంది.   సింగరేణి కూడా పింఛ న్ నిధికి  ప్రతి టన్ను బొగ్గుపై అదనంగా  రూ.10 ను వెంటనే  జమ చేయాలని సింగరేణి రిటైర్డ్​సంక్షేమ సంఘం డిప్యూటీ జనరల్​సెక్రటరీ -అళవందార్​ వేణుమాధవ్ కోరారు.