- ఆస్ట్రేలియా వర్సిటీ, ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఏర్పాటు: భట్టి
హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ, ఐఐటీ–హైదరాబాద్ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం సెక్రటేరియెట్లో భట్టితో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు మూర్తి, నరసింహ, అశోక్ కామరాజ్, మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిశెట్టి మోహన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భట్టి దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చారు. ‘‘క్రిటికల్ మినరల్స్ ప్రొడక్షన్ లో మన దేశం బాగా వెనకబడి ఉంది. బ్యాటరీల్లో ఉపయోగించే లిథియం, సెమీకండక్టర్ల తయారీకి ఉయోగించే గ్యాలియం, పర్మనెంట్ బ్యాటరీల్లో ఉపయోగించే రేర్ ఎర్త్ మెటల్స్ను సొంతంగా తయారు చేసుకుంటే దేశానికి ఎంతో మేలు. సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ఆన్ కోల్ మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెంటర్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తే మంచిది. ఈ సెంటర్ ను కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయవచ్చు” అని తెలిపారు. దీనిపై స్పందించిన భట్టి.. సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.