బొగ్గు గుట్టలు తగలబడుతున్నయ్!...సింగరేణి ఇల్లెందు ఏరియా ఓపెన్ కాస్ట్ ల్లో కాలి బూడిద

బొగ్గు గుట్టలు తగలబడుతున్నయ్!...సింగరేణి ఇల్లెందు ఏరియా ఓపెన్ కాస్ట్ ల్లో కాలి బూడిద
  • లక్ష టన్నుల వరకు పేరుకుపోయిన బొగ్గు నిల్వలు
  • ఆఫీసర్ల ప్రణాళిక లోపంతో సంస్థకు ఆర్థికంగా నష్టం
  • కష్టపడి తీసిన బొగ్గు కాలుతుండగా కార్మికుల ఆవేదన
  •  కాలుష్యం పెరుగుతోందంటూ పర్యావరణ వేత్తల ఆందోళన 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి ఓపెన్​ కాస్టుల్లోని బొగ్గు తగలబడుతోంది. ఎంతో కష్టపడి తీసిన బొగ్గు కండ్ల ముందే కాలిపోతుంటే కార్మికులు ఆవేదన చెందుతున్నారు.  భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఏరియాలోని కోయగూడెం ఓసీల్లోని బొగ్గు గుట్టలకు కొద్ది రోజులుగా మంటలు అంటుకుని కాలిపోతున్నాయి. మంచి బొగ్గు కూడా తగలబడుతుంటే, తక్కువ గ్రేడ్​రకానికి చెందినదంటూ సింగరేణి అధికారులు  నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

బొగ్గు డంప్ ​యార్డ్​ల్లో మంచి  బొగ్గు కూడా ఉందని పేర్కొంటున్నారు. తవ్విన బొగ్గును సరైన విధంగా గ్రేడింగ్​ చేయకపోవడంతో కాలి బూడిదగా మారి మట్టిలో కలిసిపోతుందంటున్నారు. ఇలా బొగ్గు కాలిపోతుండడంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆఫీసర్లు పనికిరాని బొగ్గంటూ మట్టి పోసి కప్పిపెడుతుండడం గమనార్హం. 

వేల టన్నుల్లో తగలబడుతుండగా..

ఇప్పటికే  కోయగూడెం ఓపెన్ ​కాస్టుల్లో వేల టన్నుల్లో బొగ్గు తగలబడిపోయింది. ప్రస్తుతం ఆ ఏరియాలో దాదాపు 75 వేల టన్నుల నుంచి లక్ష టన్నుల వరకు బొగ్గు నిల్వ ఉంది. అయితే.. అది తక్కువ  గ్రేడ్​  బొగ్గు అంటూ అధికారులు డంప్ ​చేస్తున్నారు. అందులో కొంత మంచి గ్రేడ్ ​బొగ్గును కలిపి తక్కువ ధరకు అమ్మితే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఉన్నారు. ఆఫీసర్లకు సరైన ప్రణాళిక లేకపోవడంతోనే సంస్థకు ఆర్థికంగా నష్టం వస్తుంది. గతంలో కోయగూడెం బొగ్గు ఏపీ, కర్ణాటకతో పాటు తెలంగాణలోని ఇటుక బట్టీలు, సిమెంట్​ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలకు భారీగా ట్రాన్స్​పోర్టు అయ్యేది.

తక్కువ గ్రేడ్​  బొగ్గుకు కూడా అధిక ధర చెబుతుండడంతోనే కొనేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లి కొని తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడి బొగ్గు క్వాలిటీగా లేకపోవడంతోనే వేరే ఏరియాల్లో తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డంప్ ​యార్డ్​ల్లోని బొగ్గును కొంత తక్కువ ధరకు అమ్మితే ఎంతో కొంత సంస్థకు  ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి.

ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు కాలిపోతున్న బొగ్గుతో ఓపెన్​ కాస్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాలుష్యం ఏర్పడుతుందని స్థానికులు, కార్మికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ గ్రేడ్​ క్వాలిటీ బొగ్గును ఏ విధంగా అమ్ముకోవాలో ప్లాన్​ చేయాల్సిన సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఎమ్మెల్యే పేరు  చెప్పుకుంటూ దందా..

మరో వైపు బొగ్గు అమ్మకాలకు సంబంధించి పర్మిట్లు ఉన్న కాంట్రాక్టర్లను స్థానికంగా ఉన్న ఓ నేత.. ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ దందా సాగిస్తున్నారు. తాను చెప్పినట్టుగానే వినాలని, పర్మిషన్ ఇచ్చిన లారీలనే బొగ్గు లోడింగ్​వద్ద పెట్టాలంటూ ఆ నేత హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్​లారీ ఓనర్లు ముందుకు రావడం లేదు. ఇక్కడ ఆ నేత చెప్పిందే ఫైనల్ కావడంతో లోడింగ్, ట్రాన్స్​పోర్టు కిరాయి కలిపి టన్ను ధర ఎక్కువ అవుతోంది. దీంతో బొగ్గును తీసుకునేందుకు కూడా వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారు. 

ఆ బొగ్గు తక్కువ గ్రేడ్

కోయగూడెంలో కాలిబూడిదవుతోన్న బొగ్గు లో గ్రేడ్​రకానికి చెందినది. దాన్ని కొనేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. ప్రతి రోజూ కొంత వినియోగదారులు తీసుకెళ్తున్నారు. కృష్టయ్య, జనరల్​ మేనేజర్​, ఇల్లెందు ఏరియా