సింగరేణికి టార్గెట్ టెన్షన్
లక్ష్యం చేరుకోవాలంటే రోజుకు మూడు లక్షల టన్నుల బొగ్గు తవ్వాలె
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్కంపెనీకి కోల్ ప్రొడక్షన్ టార్గెట్ టెన్షన్ పట్టుకుంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అధికారికంగా 70 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వాలని సింగరేణి నిర్దేశించుకుంది. ఇంటర్నల్‌గా 74 మిలియన్‌టన్నులు టార్గెట్‌గా పెట్టుకుంది. ఇంటర్నల్టార్గెట్పక్కన పెడితే అధికారికంగా నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల బొగ్గు తీయడం సైతం కష్టంగా మారింది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకునే టైంలో అండర్ గ్రౌండ్ మైన్ల నుంచి ఎంత తవ్వొచ్చు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌ల నుంచి ఎంత బొగ్గును ఉత్పత్తి చేయవచ్చో ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగానే కొత్త మైన్స్నుంచి ఎంత ఓబీ తీయాలి, ఎంత బొగ్గు ఉత్పత్తి అవుతుందో ప్రణాళిక రూపొందిస్తారు.
ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాకుండానే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను యాజమాన్యం నిర్దేశించింది. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ నుంచి కోల్ప్రొడక్షన్టార్గెట్ను పెట్టుకుంది. కానీ నైనీ ప్రాజెక్ట్‌తో పాటు కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీల నుంచి ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. నైనీ ప్రాజెక్ట్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఒక్క బొగ్గు పెళ్ల కూడా తవ్వలేదు. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీ నుంచి దాదాపు 10 లక్షల టన్నుల బొగ్గు తీయాల్సి ఉన్నప్పటికీ ఈ మైన్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులే రాలేదు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్వచ్చేసరికి కనీసం ఇంకా రెండు మూడు నెలల టైం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది కోల్ ప్రొడక్షన్ లక్ష్యాలను అధికారికంగా నిర్దేశించుకునే క్రమంలో అవసరమైన ప్రణాళికలను రూపొందించడంలో యాజమాన్యం విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిగిలింది నెల రోజులే..
ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే ఈ నెలలో రోజుకు కనీసం మూడు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల నుంచి 2.22 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 66.5 మిలియన్ టన్నులకు గానూ 59.9 మిలియన్‌టన్నుల బొగ్గు తవ్వారు. ఏప్రిల్‌నుంచి ఫిబ్రవరి వరకు ఇల్లెందు, మణుగూరు, ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియాలు మాత్రమే నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి. అడ్రియాల ప్రాజెక్ట్, భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలు కనీసం 80 శాతం కూడా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలో రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను భారీగా సాధించేందుకు యాజమాన్యం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా కంపెనీ సీఎండీ శ్రీధర్ కంపెనీలోని డైరెక్టర్లు, ఏరియా జనరల్మేనేజర్లు, ఏజెంట్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. గతేడాది దాదాపు 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా కనీసం ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ సాధించి ప్రతిష్టను కాపాడుకునేందుకు యాజమాన్యం ముమ్మర చర్యలు చేపట్టింది.