సింగరేణికి టార్గెట్ టెన్షన్!

సింగరేణికి టార్గెట్ టెన్షన్!
  • 3.15 కోట్ల టన్నులకు 2.84 కోట్ల టన్నులే బొగ్గు ఉత్పత్తి
  •  గతేడాదితో పోల్చితే 28 లక్షల టన్నులు తక్కువ
  • 11 ఏరియాలకుగాను ఇల్లెందు, ఆర్జీ–2 టార్గెట్ రీచ్ 
  •  వచ్చే ఆరు నెలల్లోనైనా సాధించేందుకు దృష్టి పెట్టిన సీఎండీ 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణికి టార్గెట్​టెన్షన్​పట్టుకుంది. గతేడాది సాధించిన బొగ్గు ఉత్పత్తితో పోల్చిచూస్తే ఈసారి దాదాపు 28 లక్షల టన్నులు మైనస్​గా ఉంది. గత ఏప్రిల్​నుంచి సెప్టెంబర్​వరకు ఆర్నేళ్ల కాలంలో 3.15  కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 2. 84 కోట్ల టన్నులు మాత్రమే తవ్వింది. సింగరేణిలోని11 ఏరియాల్లో  కేవలం ఇల్లెందు, ఆర్జీ–2 ఏరియాలు మాత్రమే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాయి.

సెప్టెంబర్ నెలకు నిర్దేశిత లక్ష్యం మేరకు 72 శాతం మాత్రమే ఉత్పత్తి అయింది. ఇలా ఉత్పత్తిలో వెనకబాటు, లక్ష్యాన్ని చేరుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై కంపెనీ డైరెక్టర్లు, ఏరియాల జీఎంలు, ఏజెంట్లతో వారం రోజుల్లో  సంస్థ సీఎండీ బలరాం రివ్యూ నిర్వహించనున్నట్టు తెలిసింది. 

 బొగ్గు ఉత్పత్తి కష్టాలు 

ఈ ఆర్థిక ఏడాదిలో 72 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏప్రిల్​నుంచి సెప్టెంబర్​వరకు ఆర్నెళ్లలో 3,15,89,100 టన్నులు సాధించాల్సి ఉంది. అయితే.. 2,84,49,547 టన్నులు మాత్రమే తవ్వగా.. టార్గెట్ లో  90 శాతంతోనే సరిపెట్టుకుంది. గతేడాది ఇదే ఆర్నెళ్లలో 3,13,18,052 టన్నులు ఉత్పత్తి చేసింది. ఈసారి వెనకబడింది. సింగరేణివ్యాప్తంగా ఇల్లెందు ఏరియా అత్యధికంగా 117 శాతం బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆర్జీ–2 ఏరియా 109 శాతంతో రెండో ప్లేస్ లో నిలిచింది.  

సెప్టెంబర్​నెలలో 51. 99 లక్షల టన్నులకుగాను 37.46 లక్షల టన్నులు ఉత్పత్తి మాత్రమే చేసింది.  నిర్దేశించిన లక్ష్యంలో 72 శాతంతోనే సరిపెట్టుకుంది. గత నెలలో  సింగరేణి వ్యాప్తంగా ఒక్క ఇల్లెందు ఏరియానే 123 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించి టార్గెట్ ను దాటింది.  కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్, జీడీకే–11 ఇంక్లైన్ లో కంటిన్యూస్​ మైనర్లు రిపేర్లలో ఉన్నాయి. దీంతో లక్ష్యం చేరుకోకపోవడానికి వర్షాలు, రిపేర్ల  టైంలో మెషినరీకి అవసరమైన స్పెర్​పార్ట్స్​సమయానికి అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.

వచ్చే ఆర్నెళ్లలోనైనా సాధించేందుకు దృష్టి

అర్ధ సంవత్సర ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో సింగరేణి వెనకబడింది. దీంతో వచ్చే ఆర్నెళ్లలోనైనా టార్గెట్​ను రీచ్​అయ్యేందుకు అధికోత్పత్తి సాధించి నిర్దేశించుకున్న 72 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడంపై సీఎండీ బలరాం దృష్టిపెట్టారు. 

ఆరునెలల్లో బొగ్గు ఉత్పత్తి వివరాలు 

ఏరియా                          సాధించిన శాతం 

ఇల్లెందు ఏరియా                  117 

ఆర్జీ-2                                       109          
అడ్రియాల ప్రాజెక్ట్​                94
ఆర్జీ-3                                        94 
కొత్తగూడెం                              93
మణుగూరు                             89
బెల్లంపల్లి                                86
ఆర్జీ-1                                       86
మందమర్రి                            78
శ్రీరాంపూర్​                            71
భూపాలపల్లి                          67
మొత్తం                                   90