బొగ్గు కార్మికులకు రూ.85 వేలు బోనస్

గోదావరిఖని, వెలుగు: కోల్ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు పీఎల్ఆర్(ఫెర్ఫార్మెన్స్‌‌‌‌ లింక్డ్‌‌‌‌ రివార్డ్‌‌‌‌‌‌‌‌) బోనస్‌‌‌‌‌‌‌‌ కింద ఒక్కో కార్మికుడికి రూ.85 వేలు చెల్లించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆదివారం ఢిల్లీలోని కోల్‌‌‌‌‌‌‌‌ఇండియా ఆఫీసు‌‌‌‌లో యాజమాన్యాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చించి ఈ మొత్తాన్ని ఫైనల్​చేశారు. 

2022‒23 ఆర్థిక సంవత్సరంలో 100శాతం మస్టర్లు(హాజరు) పూర్తిచేసిన వారికి ఈ బోనస్‌‌‌‌‌‌‌‌ దక్కనుంది. 2021‒22 ఆర్థిక సంవత్సరంలో పీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ బోనస్‌‌‌‌‌‌‌‌ కింద రూ.76,500 చెల్లించారు. 2022‒23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.79,500 ఇచ్చేందుకు యాజమాన్యాలు ముందుకు రాగా కార్మిక సంఘాలు అందుకు అంగీకరించలేదు. 

మరోసారి జరిపిన చర్చల్లో రూ.85 వేలకు ఒప్పుకున్నారు. చర్చల్లో కోల్‌‌‌‌‌‌‌‌ ఇండియా డైరెక్టర్లు వినయ్‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌, దేబాశిష్‌‌‌‌‌‌‌‌ నందా, సింగరేణి డైరెక్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.బలరామ్, సబ్సిడరీ సంస్థల డైరెక్టర్లు సమీనర్‌‌‌‌‌‌‌‌దత్తా, కేశవ్‌‌‌‌‌‌‌‌రావ్‌‌‌‌‌‌‌‌, హర్షనాథ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా, శంకర్‌‌‌‌ నాగచారి, మనీశ్‌‌‌‌కుమార్‌‌‌‌, బీఎంఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి సుధీర్‌‌‌‌ గుర్డే, మజ్రుల్‌‌‌‌‌‌‌‌అన్సారీ, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌కె పాండే, ఏఐటీయూసీ నుంచి రామేంద్ర కుమార్‌‌‌‌, సీఐటీయూ నుంచి డీడీ రామానందన్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

ఇది జాతీయ కార్మిక సంఘాల సమష్టి విజయమని, పీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బోనస్‌‌‌‌‌‌‌‌ మొత్తాన్ని సీఐఎల్‌‌‌‌‌‌‌‌ కార్మికులకు ఈ నెల 21వ తేదీ లోపు, సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ లోపు చెల్లిస్తారని బీఎంఎస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ యాదగిరి సత్తయ్య, ఏఐటీయూసీ జనరల్‌‌‌‌ సెక్రెటరీ వి.సీతారామయ్య, సీఐటీయూ జనరల్‌‌‌‌ సెక్రెటరీ మంద నర్సింహరావు తెలిపారు.