బెల్లంపల్లి రీజియన్​లో 86.24 శాతం పోలింగ్

బెల్లంపల్లి రీజియన్​లో 86.24 శాతం పోలింగ్

కోల్​బెల్ట్, వెలుగు :బెల్లంపల్లి రీజియన్​ పరిధిలో సింగరేణిలో పనిచేస్తున్న అధికారులకు సంబంధించిన కోల్​మైన్స్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. రీజియన్​లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్​ ఎస్టీపీపీ ఏరియాలకు చెందిన అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ నిర్వహించారు.రీజియన్​ పరిధిలోని 545 మంది అధికారులకు 470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.86.24 శాతం పోలింగ్​ నమోదైంది. మందమర్రి ఏరియాలో179 మంది అధికారులకు 150  మంది, శ్రీరాంపూర్​ ఏరియాలో 217 మందికి  199, బెల్లంపల్లి ఏరియాలో 74 మందికి 54 , జైపూర్​ ఎస్టీపీపీ ఏరియాలో 75 మందికి  67 మంది ఓటు వేశారు.

ఆదివారం సింగరేణికి సెలవు దినం కావడంతో మధ్యాహ్నం నాటికే పోలింగ్ 80 శాతం నమోదైంది. 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా రహస్య బ్యాలట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. అధికారులు ఉత్సాహంగా ఓటు వేశారు. ఆయా పోలింగ్​ కేంద్రాల వద్ద ఎన్నికల బరిలో నిలిచిన అధికారులు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం కనిపించింది. సింగరేణి అధికారుల సంఘం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కార్పొరేట్​ సీజీఎం(సేఫ్టీ) గురువయ్య ఆయా ఏరియాల్లో పోలింగ్​ సరళిని పరిశీలించారు.

మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, జైపూర్​ ఎస్టీపీ ఏరియాల జీఎంలు మనోహర్, సంజీవరెడ్డి, రవిప్రసాద్, బసివి రెడ్డి ఏరియా ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. కాగా సింగరేణి వ్యాప్తంగా 2,174 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్​, సింగరేణి స్థాయిలో ఆరుగురు చొప్పున 12 పోస్టులకు  బరిలో నిలిచిన ప్రతిఒక్కరికి ఒక్కొక్క ఓటు  వేయడంతో అధికారులు పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఎక్కువ సేపు ఉండాల్సి వచ్చింది.