- పోరుబందర్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం
అహ్మదాబాద్: ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) గుజరాత్‌లోని పోర్ బందర్‌లో ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు చనిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. రొటీన్ డ్యూటీలో భాగంగా పని ముగించుకుని హెలికాప్టర్.. పోరుబందర్‌కు బయల్దేరింది. కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ... రన్‌వేను బలంగా ఢీకొట్టి కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఫైర్ సేఫ్టీ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారని, వారిని సివిల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని ఐసీజీ అధికారులు తెలిపారు. మృతి చెందిన వాళ్లను ఇంకా గుర్తించలేదన్నారు. ధ్రువ్ అని పిలిచే ఈ హెలికాప్టర్.. ఆర్మీకి సేవలు అందిస్తున్నది. అయితే, హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు వివరించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ జరుగుతున్నదని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్లు తెలిపారు. హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే కూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.