కోస్టల్‌‌ రోడ్డుతో జాలర్లు లబోదిబో

కోస్టల్‌‌ రోడ్డుతో జాలర్లు లబోదిబో

అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రజల జీవనోపాధిని ఘోరంగా దెబ్బతీసే మెగా ప్రాజెక్టు పనులు ముంబైలో తాజాగా ప్రారంభమయ్యాయి. అదే ‘కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ (సీఆర్పీ)’. నగరంలోని పశ్చిమ తీర ప్రాంతంలో 29.2 కిలో మీటర్ల పొడవైన ఈ రోడ్డు ప్రపోజల్‌‌ మొదట్నుంచీ వివాదంగానే ఉంది. మెరైన్ డ్రైవ్ ప్రాంతం నుంచి కాండివలి ఏరియాను కలిపే ఈ రోడ్డు నిర్మాణాన్ని ముంబై నగర ప్రజలు, పర్యావరణవేత్తలు, తీర ప్రాంతంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరేబియా సముద్రంనుంచి కోస్టల్ రోడ్డు నిర్మించాలన్నది బృహన్ముంబై మునిసిపల్‌‌ కార్పొరేషన్‌‌ (బీఎంసీ) ప్లాన్. ఇదేమీ చిన్నా చితకా ప్రాజెక్ట్ కాదు… 12 వేల కోట్ల రూపాయల మెగా ప్రాజెక్ట్.

సముద్ర తీర ప్రాంతంలో ఎనిమిది లైన్లతో కూడిన ప్రాజెక్ట్. ముంబై కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ పూర్తయితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది కోలివాడ జాలర్లే. ఇప్పటికే వాళ్లు సముద్రంలోకి వెళ్లకుండా సర్కార్ ఆంక్షలు విధించింది. ఇది సముద్రంలో బాగా చేపలు పడే సీజన్. మరబోట్ల సాయంతో పెద్ద సంఖ్యలో చేపలు పట్టుకుని, నాలుగు డబ్బులు సంపాదించుకునే రోజులివి. సరిగా ఈ సమయంలోనే కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ పనులకు అడ్డు రాకూడదంటూ చేపల వేటను నిషేధించడంతో జాలర్లు లబోదిబోమంటున్నారు. కోలివాడ జాలర్లు కొన్ని దశాబ్దాలుగా సముద్రంమీదే ఆధారపడి బతుకుతున్నారు. తాత ముత్తాతల కాలంనుంచి సముద్రంలోకి వెళ్లడం, చేపలు పట్టుకోవడం, మార్కెట్‌‌లో అమ్ముకుని వచ్చిన సొమ్ముతో బతుకుబండి నడుపుకోవడం… ఇదే వీరి జీవితంగా మారింది. వీరికి చేపలు పట్టడం, అమ్ము కోవడం మినహా మరోపని రాదు. చేత కాదు కూడా.

కోస్టల్ ప్రాజెక్ట్ కోటీశ్వరుల కోసమేనా?
కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ కేవలం కొంతమంది సంపన్నుల కోసమేననే విమర్శలు వస్తున్నాయి. ముంబై రవాణా వ్యవస్థపై కనీస అవగాహన లేనివాళ్లే ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని, ఇది గనుక పూర్తయితే పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. పర్యావరణపరంగా తీర ప్రాంతం చాలా కీలకమైంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే చేతులారా ఎకో సిస్టమ్‌ని దెబ్బతీసుకోవడమే అంటున్నారు నిపుణులు. దీని ప్రభావం తీరాన్ని ఆనుకుని బతికే కొన్ని వేల కుటుంబాలపై పడుతుంది. 2018 డిసెంబర్ 26న కేంద్రం ఆమోదించిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌‌జెడ్) ఉత్తర్వు ఎన్విరాన్‌‌మెంట్‌‌కి పెనుముప్పుగా మారింది. ఈ ఆర్డర్‌‌ ప్రకారం పర్యావరణపరంగా కఠిన నిబంధనలను కూడా రిలాక్స్‌‌ చేయడానికి అవకాశం ఉంటుంది. సీఆర్‌‌జెడ్ ఉత్తర్వుల ప్రభావం తీర ప్రాంత జన జీవితాలపై పడే నెగెటివ్‌‌ ఇంపాక్ట్‌‌కి అవకాశం ఉంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌‌జెడ్) ఉత్తర్వులు కేవలం సంపన్నులకే ఉపయోగపడతాయి. ఎందుకంటే, తీరం వెంబడి రోడ్లు, విద్యుత్‌‌ వగైరా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌, రియల్ ఎస్టేట్ బిజినెస్, టూరిజం పెరుగుతాయి. తీరం వెంట ఉండే ఇళ్లకు రేట్లు పెరుగుతాయి. తీర ప్రాంతాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే సీఆర్‌‌జెడ్ ఉత్తర్వులు ఉపయోగపడతాయి. ముంబై వంటి తీర ప్రాంత నగరాలలో రోజురోజుకూ జనాభా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడాల్సిందే. ఇందులో మరో అభిప్రాయమే లేదు. అయితే ప్రజల బతుకులను, పణంగా పెట్టి ప్రాజెక్ట్‌‌లు డిజైన్ చేయడం వల్ల అనుకున్న ప్రయోజనాలు సిద్దించవు. కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది.