- అమృత్ ఫండ్స్‌తో వాటర్ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం
- మంచిర్యాల రాళ్లవాగుపై రూ.13.50 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి
- శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో త్వరలోనే నీటి ఎద్దటి తీరనుంది. అమృత్ స్కీమ్ కింద మంజూరైన ఫండ్స్‌తో మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో కొత్తగా వాటర్ ట్యాంకులు, పైపులైన్లు నిర్మించనున్నారు. అలాగే మంచిర్యాల బైపాస్ రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద రాళ్లవాగుపై హెలెవల్ బ్రిడ్జి నిర్మించనున్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణంతో వాగు అవతల ఉన్న రంగంపేట, పవర్‌హౌస్ కాలనీ, ఆండాలమ్మ కాలనీ వాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆదివారం ఈ పనులకు శంకుస్థాపన చేశారు. అమృత్ ఫండ్స్ రూ.48.50 కోట్లతో నీటి సరఫరా పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణానికి 4వ వార్డు సాయికుంటలో శంకుస్థాపన చేశారు. టీయూఎఫ్ఐడీసీ ఫండ్స్ రూ.13.50 కోట్లతో రాళ్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి, రూ.5.67 కోట్ల డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు భూమిపూజ చేశారు.
నస్పూర్ మున్సిపాలిటీ 20వ వార్డు సీతారాంపల్లిలో అమృత్ నీటి సరఫరా పైపులైన్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.73 కోట్లతో, డీఎంఎఫ్టీ ఫండ్స్ రూ.4.03 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో అమృత్ నీటి సరఫరా పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణానికి రూ. 20 కోట్లతో, డీఎంఎఫ్టీ ఫండ్స్ రూ.55లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. గూడెం లిఫ్ట్ దగ్గర ఇరిగేషన్ ఫండ్స్ రూ.1.59 కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.