
అమరావతి: టీటీడీ గోశాల ఇష్యూ ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. ఈ వ్యవహారం అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. గత కొద్ది రోజులుగా టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని వైసీపీ ఆరోపిస్తోంది. అలాంటిదేమి లేదని.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అధికార కూటమి కౌంటర్ ఇస్తోంది.
గోవుల మృతిని నిరూపించాలని టీటీడీ సవాల్ విసరగా.. సరే నిరూపిస్తానని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. స్టేట్‌లో ఓ వైపు టీటీడీ గోశాల వివాదం దుమారం రేపుతోన్న వేళ తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. టీటీడీ ఈవో శ్యామలారావు ఉంటున్న బంగ్లాలోకి నాగుపాము ప్రవేశించింది. వెంటనే అప్రమ్తతమైన ఈవో సిబ్బంది పామును పట్టుకుని గోనె సంచిలో వేస్తుండగా టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి చేతిపై పాము కాటు వేసింది.
Also Read:-రూ.800 కోట్ల విలువైన జగన్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్
దీంతో హుటాహుటిన పాము కాటుకు గురైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ గోశాల వివాదం హాట్ టాపిక్‌గా నడుస్తోన్న వేళ.. అదే టీటీడీ ఈవో బంగ్లాలోకి పాము ప్రవేశించడం.. ఓ వ్యక్తిని కాటు వేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భక్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. రాజకీయ స్వార్ధం కోసం దేవుడి విషయంలో అబద్ధాలు ఆడటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు మాట్లాడుకుంటున్నారు.