- ‘న్యూఇయర్’ కోసం తీసుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
- ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తూ డిచ్‌పల్లిలో దొరికిన నిందితులు
నిజామాబాద్, వెలుగు : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కోసం కొకైన్, ఎండీఎంఏ తీసుకెళ్తున్న ఇద్దరిని సోమవారం నిజామాబాద్ శివారులోని డిచ్పల్లి హైవేపై పోలీసులు పట్టుకున్నారు. వీరి కారులో 12.3 గ్రాముల కొకైన్‌తో పాటు 3.2 గ్రాముల ఎండీఎంఏ, 3.1 గ్రాముల గాంజా పౌడర్ దొరికింది. వివరాలను సోమవారం ఇన్చార్జి సీపీ జయరాం వెల్లడించారు. ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు జొన్నాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి విక్రమ్‌రెడ్డి, పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ కొన్నాళ్ల నుంచి హోటల్ బిజినెస్ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు.
డ్రగ్స్‌కు అలవాటుపడిన వీరు మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి కొకైన్, ఎండీఎంఏ, గాంజాను ఢిల్లీలో రాహుల్, మైక్ నుంచి కొన్నారు. అక్కడి నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. నడిపల్లి తండా హైవే వద్ద డిచ్పల్లి సీఐ కృష్ణ, ఎస్ఐ మహేశ్ వీరి కారు తనిఖీ చేయగా కొకైన్‌తో పాటు ఎండీఎంఏ, గాంజా పౌడర్ దొరికింది. ఇవి కాకుండా మరో మూడు కవర్లు దొరికాయని, అందులో ఉన్న పౌడర్ ఏమిటో తేల్చే పనిలో పడ్డామని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని ఇన్చార్జి సీపీ జయరాం తెలిపారు. ఏసీపీ కిరణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్‌రాజు, ఇన్స్పెక్టర్ అజయ్‌బాబు ఉన్నారు.