
- విజయవంతంగా ఆపరేషన్ చేసిన గాంధీ హాస్పిటల్ డాక్టర్లు
పద్మారావునగర్, వెలుగు : ఏడాదిన్నర వయసున్న చిన్నారికి గాంధీ డాక్టర్లు అరుదైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్‌లోని మిత్యా నాయక్ తండాకు చెందిన ఏడాదిన్నర వయసున్న పాత్లోత్ శివకన్యకు వినికిడి లోపం ఉంది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఇటీవల గాంధీ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు.. శివకన్యకు సర్జరీ చేయాలని చెప్పారు. ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్ బాబు ఆధ్వర్యంలోని మెడికల్ టీమ్ బుధవారం చిన్నారికి విజయవంతంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను నిర్వహించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ శోభన్ బాబు మాట్లాడుతూ.. గాంధీలో 2022 ఆగస్టులో కాక్లియర్ఇంప్లాంట్ సర్జరీలను ప్రారంభించామని,. ఇప్పటివరకు అతి తక్కువ వయస్సు వారికి ఈ సర్జరీ చేయడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. చిన్నారి శివకన్య ఇప్పుడు అందరిలాగే మాట్లాడటం, వినడం చేయగలదన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ జేబీఎస్ రాథోడ్, అసోసియేట్ ప్రొఫెసర్ కబీర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప్తి, అనస్తీషియా డాక్టర్లు మురళీధర్, స్టాఫ్ నర్సులు జాస్మిన్, వసంతి, దేవి, ఆడియోలాజిస్ట్ సాయి పాల్గొన్నారు.