పెనుబల్లి/సత్తుపల్లి, వెలుగు : కోడిపందేలతో తెలుగు రాష్ట్రాల సరిహద్దు కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ ఉన్న మూడు రోజుల్లో కోట్లలో చేతులు మారాయి. ఇక్కడ కోడిపందేలకు అనుమతులు లేకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పందెం రాయుళ్లు ఏపీ పరిధిలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు పరుగులు పెట్టారు. ఏలూరు జిల్లా రావికంపాడు, రాఘవాపురం, కామవరపుకోట, సీతానగరంలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, మల్లేలా, కాకర్ల, జనార్ధనపురం తదితర గ్రామాల్లో కోడి పందేలు భారీగా నిర్వహించారు. కోడిపుంజులపై పందెం కాసేవాళ్లు ఒక్కోక్క పందెంపై రూ.30 వేల నుంచి లక్షల రూపాయల వరకు పెట్టారు.
కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి..
పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ శివారు పామాయిల్ తోటలో కోడి పందేలు స్థావరంపై మంగళవారం వీఎం బంజర్ పోలీసులు దాడి చేశారు. రెండు పందెం పుంజులు, రెండు కోడి కత్తులు, రెండు బైకులు, రూ.1,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న పందెం రాయుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.