- ఫుడ్ సేఫ్టీ తనిఖీలునామ్ కే వాస్తే
- కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల పార్సిళ్లలో పురుగులు
- ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసిన వాటిలోనూ క్వాలిటీ లేని ఫుడ్
- స్నాక్స్ ప్యాకెట్లపై ఫుడ్ సేఫ్టీ అథారిటీ లోగో లేకుండా అమ్మకాలు
- సిటిజన్లు కంప్లయింట్ చేస్తున్నా పట్టించుకోని బల్దియా అధికారులు
హైదరాబాద్, వెలుగు: సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. జ్యూస్, ఐస్ క్రీమ్‌ల నుంచి బిర్యానీ వరకు క్వాలిటీ లేకుండా ఉంటోన్న పట్టించుకోవడం లేదు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆన్ లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పురుగులు వస్తున్నాయి. పాడైపోయిన ఫుడ్ డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి సిటిజన్ల నుంచి కంప్లయింట్లు వస్తున్నాయి. కొన్ని షాపుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ప్యాకింగ్ స్నాక్స్ ప్యాకెట్లపై కనీసం ఫుడ్ సేఫ్టీ అథారిటీ లోగో కూడా లేకుండానే అమ్ముతున్నారు. ఇదే అంశంపై ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు సైతం అధికారులను నిలదీశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతునప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీల్లోనూ కుళ్లిపోయిన, పురుగులు పట్టిన ఫుడ్‌ను అందిస్తున్నట్లు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్ లైన్లో ఆర్డర్ పెడితే క్వాలిటీ ఫుడ్ రాకపోవడంతో కస్టమర్లు సదరు రెస్టా
రెంట్లు, హోటల్, బేకరీలపై ఆన్లైన్ ఫుడ్ యాప్‌లలో నెగిటెవ్ కామెంట్లు, రివ్యూ పెడుతూ కంప్లయింట్లు చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసిన ప్యాకింగ్ ఐటమ్స్ ను ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 22 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పనిచేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తగ్గిన శాంపిల్స్ సేకరణ
గతేడాది 12,375 హోటళ్లపై దాడులు జరుపగా.. 978 ఫుడ్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. ఇందులో 126 మంది రూల్స్ బ్రేక్ చేశారని , 36 హోటళ్లలో- ప్రమాదకరమైన ఫుడ్ ఉందని, 58 మంది క్వాలిటీని పాటించలేదని, 32- తప్పుడు బ్రాండ్ ఉన్నవి గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 8,402 హోటళ్ల మాత్రమే తనిఖీలు జరిపిన అధికారులు 1,018 శాంపిల్స్ ను మాత్రమే కలెక్ట్ చేశారు. 143 మంది రూల్స్ బ్రేక్ చేశారని, 21 వాటిలో ప్రమాదకరమైన ఫుడ్ ఉందని, 35- తప్పుడు బ్రాండ్లు , 87 హోటళ్లు ప్రమాణాలు పాటించలేదని గుర్తించి చర్యలు తీసుకున్నారు.
ఆన్లైన్ ఆర్డర్లకు దూరం
ఫ్రూట్స్, జ్యూస్‌ల నుంచి బిర్యానీ, కర్రీస్, కేక్‌లు, బేకరీ ఐటమ్స్ వరకు ఇలా ఆన్లైన్లో ఏది ఆర్డర్ చేసినా క్వాలిటీ ఉండటం లేదని సిటిజన్లు చెప్తున్నారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు క్వాలిటీ లేని ఫుడ్‌ను అందిస్తుండటంతో చాలామంది ఆన్లైన్ ఆర్డర్లకు దూరమవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేసి క్వాలిటీ లేని ఫుడ్‌ను అమ్మే హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని సిటిజన్లు కోరుతున్నారు.
బిర్యానీ పార్సిల్లో బొద్దింక
గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీపై జీహెచ్ఎంసీతో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ )కు కూడా బాధితులు కంప్లయింట్లు చేస్తున్నారు. ఏఎస్ రావునగర్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చిందని శోభిక అనే యువతి బుధవారం జీహెచ్ఎంసీతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐకి ట్విట్టర్లో కంప్లయింట్ చేసింది. ఇలా గ్రేటర్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ మంచిగ ఉంటలేదని డైలీ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, ట్విట్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నేరుగా కంప్లయింట్లు వస్తున్నాయి. వీటి ఆధారంగా సదరు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ, సూపర్ మార్కెట్ల నుంచి ఆఫీసర్లు శాంపిల్స్సేకరిస్తున్నారే తప్ప మిగతా టైమ్‌లో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెలకు 6 శాంపిల్స్ సేకరించాల్సి ఉంది. ఇలా 22 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నెలకు దాదాపు140 శాంపిల్స్ సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంత మొత్తం కనిపించడం లేదు. కంప్లయింట్ చేసిన వెంటనే చర్యలు తీసుకోకుండా అధికా రులు ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదుదారులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై అధికా రులను అడిగితే తాము శాంపిల్ సేకరించి షోకాజ్ నోటీసులు జారీ చేయడం వరకు మాత్రమేనని, పెనాల్టీలు అడిషనల్కలెక్టర్లు వేయాల్సి ఉందని చెబుతున్నారు. అయితే గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు ఈ ఏడాది సుమారు 30 మందికి పెనాల్టీలు వేశారు.