కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌ ముందుకు

కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌ ముందుకు

లండన్‌‌‌‌‌‌‌‌: వింబుల్డన్ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో అమెరికా టెన్నిస్ స్టార్, రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో గాఫ్ 6–2, 6–1తో  క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్సా టొడొని (రొమేనియా)పై వరుస సెట్లలో విజయం సాధించింది. మరో అమెరికన్‌‌‌‌‌‌‌‌, 11వ సీడ్‌‌‌‌‌‌‌‌ డానియెల్లి కొలిన్స్‌‌‌‌‌‌‌‌ 6–3, 7–6 (7/4)తో క్లారా టాసన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి ముందంజ వేసింది. 

ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) 7–5, 6–7 (9/11), 6–3తో మగ్డా లినెటె (పోలాండ్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గగా, బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/4), 6–7 (1/7), 7–5తో  కుదెర్మెటోవా (రష్యా)పై కష్టపడి గెలిచింది. మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో  డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా, ఐదో సీడ్‌‌‌‌‌‌‌‌ డానిల్ మెద్వెదెవ్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టగా, ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టాడు.  మూడో సీడ్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్​ (స్పెయిన్) 7–6 (7/5), 6–2, 6–2తో వుకిచ్ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మెద్వెదెవ్ (రష్యా) 6–7 (3/7), 7–6 (7/4), 6–4, 7–5తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై కష్టపడి గెలిచాడు. కానీ, కాస్పర్ రూడ్ (నార్వే) 4–6, 5–7, 7–6 (7/1), 3–6తో ఫాబియో ఫోగ్నిని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 

నగాల్‌‌‌‌‌‌‌‌ ఇంటిదారి..బోపన్న జోడీ బోణీ.. 

ఈ టోర్నీలో ఇండియా లెజెండ్ రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న డబుల్స్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేయగా.. యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ సుమిత్ నగాల్‌‌‌‌‌‌‌‌ పోరాటం ముగిసింది. సుమిత్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు డబుల్స్‌‌‌‌‌‌‌‌లోనూ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టాడు. నగాల్–డుసన్ లజోవిచ్ (సెర్బియా) జంట తమ మొదటి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 2–6, 2–6తో స్పెయిన్ ద్వయం మునర్–పెడ్రో మార్టినెజ్‌‌‌‌‌‌‌‌ చేతిలో వరుస సెట్లలో చిత్తయింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 7–5, 6–4తో రాబిన్ హాసె–సాండర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టింది.