పెండ్లిళ్లకు కోడ్ కష్టాలు .. చెక్ పోస్టుల వద్ద పట్టుబడుతున్న నగదు

పెండ్లిళ్లకు కోడ్ కష్టాలు .. చెక్ పోస్టుల వద్ద పట్టుబడుతున్న నగదు
  • నగలు,పెండ్లి సామన్లు కొనేందుకు అవస్థలు 
  • ఏప్రిల్ నెలాఖరు వరకు శుభముహూర్తాలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఈనెల 30 నుంచి ఏప్రిల్​నెలాఖరు వరకు శుభముహూర్తాలు ఉండడంతో చాలామంది పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రావడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. నగలు, బట్టలు, ఇతర వస్తువులు కొనేందుకు డబ్బులు తీసుకుని వెళ్లాలంటే భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ.. స్టేట్​బార్డర్లలోనూ ఏర్పాటు చేసిన చెక్​పోస్టుల్లో తనిఖీ చేస్తున్న పోలీసులు ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్తున్న డబ్బులను సీజ్​ చేస్తున్నారు. 

రూ.50 వేల కన్నా ఎక్కువ ఉంటే సమస్య

శుభకార్యాలు పెట్టుకున్నవాళ్లు బంగారు నగలు, కానుకలను కొనేందుకు హైదరాబాద్, కరీంనగర్​, నిజామాబాద్​తదితర పట్టణాలకు వెళ్తుంటారు. ఎన్నికల కోడ్​అమలులో ఉండడంతో రూ. 50 వేలకన్నా ఎక్కువ నగదును, బంగారాన్ని తీసుకెళ్లాలంటే సమస్య వస్తోంది. ఈ మధ్య పెండ్లిళ్లలో ఖర్చులకు ఎవరూ వెనుకాడడంలేదు. మధ్యతరగతి వాళ్లు కూడా పెండ్లిళ్లను అట్టహాసంగా చేస్తూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బంగారం, బట్టల కొనుగోలు.. ఫంక్షన్ హాల్స్, డెకరేషన్స్, బ్యాండ్, తదితర అవసరాలకోసం లక్షల్లో తీసుకెళ్లాల్సిఉంటుంది.

చాలాకాలం నుంచి దాచుకున్న డబ్బులనే శుభకార్యాలకు వినియోగించడం, ఆన్ లైన్​లో క్యాష్​ ట్రాన్స్​ఫర్​చేయడానికి పరిమితులు ఉండడంవల్ల చాలావరకు పెండ్లిళ్లకు నగదు చెల్లింపులే చేస్తుంటారు. పెండ్లిళ్లకు సంబంధించి డబ్బులు తీసుకెళ్తున్నట్టు చెప్పినా ఆధారాలు లేవంటూ సీజ్​ చేస్తున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులకు సరైన పత్రాలు సమర్పించి నగదు విడిపించుకోవాలని చెప్తున్నారని, దీనివల్ల ఒకటిరెండుసార్లు తిరగాల్సివస్తోందని అంటున్నారు. 

వేలల్లో పెండ్లిళ్లు 

ఈ నెల 28 నుంచి ఉగాది వరకు శుభ ముహుర్తాలున్నాయి. ఈ నెల 28, 29,30, ఏప్రిల్ లో 1, 3, 4, 10, 18, 19, 20, 21, 24 తేదీల్లో మంచి ముహూర్తాలుండగా..ఆ తర్వాత ఆగస్టు వరకు మూహుర్తాలు లేవు. మూడు నెలల గ్యాప్ ఉండడంతో ఏప్రిల్​నెలాఖరు వరకు వేలల్లో పెండ్లిళ్లు జరగనున్నాయి. పెండ్లిళ్ల సీజన్​అంతా కోడ్​ అమలులో ఉండడంతో జనానికి ఇబ్బందులు తప్పడంలేదు. 

కోడ్ ను అమలు చేస్తున్నాం

ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేస్తున్నాం. సరైనా ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్లినట్లయితే సీజ్ చేస్తున్నాం. రూ. 10 లక్షలకు మించిన బ్యాంక్ లావాదేవీలపైనా దృష్టి పెడుతున్నాం. 

 అఖిల్ మహాజన్, ఎస్పీ, రాజన్నసిరిసిల్ల జిల్లా

మినహాయింపు ఇవ్వాలి

ఏప్రిల్​3న నా కూతురు పెండ్లి ఫిక్స్​అయ్యింది. కోడ్ రావడంతో ఫంక్షన్ హాల్స్, నగలు, ఇతర షాపింగ్ కోసం సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట వెళ్లాలంటే భయమేస్తోంది. చెక్ పోస్టుల దగ్గర రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే పట్టుకుంటున్నారు. పెండ్లి పనులకు వెళ్తున్నవారికి మినహాయింపు ఇవ్వాలి. 

బత్తుల చంద్రం. సిరిసిల్ల