ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ బెంగళూరు, హైదరాబాద్‌లోని తన కార్యాలయ ఆస్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాన్-కోర్ రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టే ప్రణాళికలో భాగంగా ఈ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్‌తో పాటు చెన్నైలోని సిరుసేరిలోని 14 ఎకరాల క్యాంపస్‌ను ఖాళీ చేయాలని భావిస్తోంది. ఇటీవల విప్రో.. హైదరాబాద్, బెంగళూరులో ఆఫీస్ ఆస్తుల్ని అమ్మాలని నిర్ణయించుకున్న తర్వాత.. కాగ్నిజెంట్ ఈ షాకింగ్ నిర్ణయాన్ని వెలువరించింది.
ఈ రెండు రకాల ఆస్తుల్ని విక్రయించడంతో కాగ్నిజెంట్ రానున్న 2 సంవత్సరాలలో 400 మిలియన్ డాలర్ల వరకు ఆదా చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ నిర్ణయంతో 11 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్థలాన్ని ఖాళీ కానున్నట్టు సమాచారం. ఇది ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగమేనని.. మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను పునర్‌వ్యవస్థీకరించాలని చూస్తున్నట్టు కాగ్నిజెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇదే క్రమంలో కొంత స్థలం అద్దెకు ఇచ్చే యోచనలో కూడా ఐటీ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు.
కాగ్నిజెంట్ కంపెనీలకు సాంకేతికతను ఆధునికీకరించడంలో, ప్రక్రియలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది. సెప్టెంబరు 30, 2023తో ముగిసిన మూడవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో 16 శాతం క్షీణతతో 525 మిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి ఇది 629 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ఆదాయం దాదాపు 4.89 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, అధిక కస్టమర్ సంతృప్తి స్కోర్‌లు, బుకింగ్‌లలో నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తూ మూడవ త్రైమాసికంలో మేము కంపెనీ ఫండమెంటల్స్‌ను బలోపేతం చేశామని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవి కుమార్ ఎస్ అన్నారు.