బీటెక్ ఫ్రెషర్స్కు నెలకు రూ.20 వేల జీతం కూడా దండగే.. కాగ్నిజెంట్ శాలరీ ప్యాకేజీపై దుమారం

బీటెక్ ఫ్రెషర్స్కు నెలకు రూ.20 వేల జీతం కూడా దండగే.. కాగ్నిజెంట్ శాలరీ ప్యాకేజీపై దుమారం

ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ భారీ సంఖ్యలో ఫ్రెషర్స్ను తీసుకునే పనిలో ఉంది. ఇందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. బీటెక్ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్కు సంవత్సరానికి రెండున్నర లక్షల జీతం ఇవ్వాలని కాగ్నిజెంట్ డిసైడ్ అయింది. అంటే.. కాగ్నిజెంట్ సంస్థలో జాయిన్ అయ్యే  ఫ్రెషర్కు నెలకు 20 వేల జీతం ఇస్తారనమాట. ఈ శాలరీ ప్యాకేజీపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డ్రైవర్లు ఇంత కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి.

 

కాగ్నిజెంట్ ఆఫర్ చేసిన ఈ శాలరీ ప్యాకేజీని బెంగళూరుకు చెందిన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త సమర్థించారు. 1811 ల్యాబ్స్ ఫౌండర్ అయిన వాత్సల్ సంఘ్వీ కాగ్నిజెంట్ శాలరీ ప్యాకేజీని వెనకేసుకొచ్చారు. అసలు ఫ్రెషర్స్కు నెలకు 20 వేలు ఇవ్వడం కూడా దండగ అని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఫ్రెషర్స్లో అసలు ఏమాత్రం స్కిల్స్ ఉండటం లేదని, చాలామందికి అసలు ప్రొఫెషనల్గా కమ్యునికేట్ అవడమే తెలియదని ఆయన చెప్పారు. కోడ్ రాయడం రాదని, ఎక్కువ మంది ఫ్రెషర్స్కు అసలు ప్రొఫెషనల్గా ప్రవర్తించడమే తెలియదని సంఘ్వీ వ్యాఖ్యానించారు. ఇది ఓపెన్ మార్కెట్ అని.. కాగ్నిజెంట్ ఇచ్చే జీతాన్ని ట్రైనింగ్ స్టైఫండ్గా చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. ఆ శాలరీ ఆఫర్ నచ్చనప్పుడు అసలు అప్లై చేయొద్దని, స్కిల్స్ను పెంచుకుని ముందుకెళితే బోలెడన్ని జాబ్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు.

సంఘ్వీ తన ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన ఈ పోస్ట్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్వాలిటీ ఫ్రెషర్స్ దొరకడం లేదని బీటెక్ ఫ్రెషర్స్ మీద పడి ఏడవడం మానుకోవాలని హితవు పలికారు. ఇలా భావించే బదులు ఐటీ కంపెనీలే కాలేజ్ క్యాంపస్ల్లో రీఫ్రెషర్స్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. కొన్ని కాలేజీలతో అనుసంధానమై ఉచితంగా కోర్సులు నేర్పిస్తే ఫ్రెషర్స్పై ఇలా పడి ఏడవాల్సిన అవసరం ఉండదు కదా అని సూచించారు. ఇక.. కాగ్నిజెంట్ తాజా ఆఫర్ విషయానికొస్తే.. 2024 ఫ్రెషర్స్ బ్యాచ్ నుంచి ఉద్యోగ నియామకాలకు ఈ ఐటీ సంస్థ ప్రకటన ఇచ్చింది. ఆగస్ట్ 14 అప్లికేషన్ డెడ్ లైన్ పెట్టింది. ఉద్యోగానికి సెలక్ట్ అయితే.. రూ.2.52 లక్షల వార్షిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగాల్లో మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిందే. రెసిషన్ కారణంగా చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన పరిస్థితి ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో జీతం కంటే ఉద్యోగం దొరికితే చాలని భావించి చాలామంది ఫ్రెషర్స్ కాగ్నిజెంట్ జాబ్కు అప్లై చేసుకున్నారు.