పోలా.. అదిరిపోలా..: స్కూల్ క్లాస్ లీడర్ ఎన్నికల్లో EVM ఓటింగ్

పోలా.. అదిరిపోలా..: స్కూల్ క్లాస్ లీడర్ ఎన్నికల్లో EVM ఓటింగ్

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందంటే ఏంటో అనుకున్నాం కానీ, బహుశా ఇలాంటి ఘటనలే అందుకు కారణమై ఉండొచ్చు. ఎన్నికల్లో ఓటమి చెందిన రాజకీయ నేతలు EVM ఓటింగ్ వద్దురా బాబోయ్ అని మొత్తుకుంటుంటే.. ఓ పాఠశాలలో క్లాస్ లీడర్‌ ఎన్నికల్లో ఇదే తరహా ఓటింగ్ నిర్వహించారు. 

కోయంబత్తూరు

సింగనల్లూరు సమీపంలోని మసకాలిపాళయంలోని ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ లీడర్ ఎంపిక కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం) తరహాలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఘటన ఈ నెల 6న జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుందో విద్యార్థులకు తెలియజెప్పేందుకు పాఠశాల యాజమాన్యం ఈ వినూత్న పద్ధతిని అవలంభించింది.

Also Read :- రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న నిండు కుటుంబం

దొంగ ఓటేసే అవకాశం లేదు

అచ్చం రాజకీయ నేతల్లానే పోటీలో ఉన్న విద్యార్థులు పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి, తోటి విద్యార్థులను ఓట్ల కోసం అభ్యర్థించారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడంతోపాటు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది పోటీ పడగా.. 550 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజమైన ఎన్నికల సన్నివేశాలను ప్రతిబింబిస్తూ, విద్యార్థులే ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. 

నామినేషన్ల దాఖలు నుండి ప్రచారం వరకు మొత్తం సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రోటోకాల్‌ను అనుసరించారు. ఒకసారి ఓటేసిన విద్యార్థి మరోసారి అలా చేసే అవకాశం లేకుండా వేలుకు సిరా మార్క్ కూడా వేశారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఫలితాలు వెలువడ్డాయి. ఎనిమిదో తరగతికి చెందిన హడ్సన్ అలెగ్జాండర్ అనే విద్యార్థి నాయకునిగా ఎన్నికవ్వగా.. ఏడవ తరగతి విద్యార్థి గాయత్రి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

Also Read :- మెట్రో పార్కింగ్‌లో బైక్‌ల దొంగ అరెస్ట్

యాజమాన్యంపై ప్రశంసలు 

ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన కోయంబత్తూరు కార్పొరేషన్‌ మిడిల్‌ స్కూల్‌ యాజమాన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఈ ప్రయోగాత్మక అనుభవం విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో పౌర బాధ్యతలకు వారిని సిద్ధం చేస్తుందని కితాబిచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకపోతే ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో.. తెలుసొస్తుందని అంటున్నారు.