తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న చలితీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో.. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం పది గంటలైనా చలి తీవ్రత తగ్గడం లేదు. ఈ సీజన్ లో నవంబరు నెలలోనే చలి మొదలైంది. వారం రోజుల కిందట 15 డిగ్రీలున్న ఉష్ణోగ్రత.. ఇప్పుడు 10.7 డిగ్రీలకు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా ఉంది. వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండటంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారు జామున మంచు కురుస్తుండటంతో పాటు.. చలిగాలులు ఎక్కువగా ఉంటున్నాయి. 

గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరగటంతో.. రాత్రి ఎనిమిది గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ సారి వర్షాలు భారీగా కురవడంతో.. చలి ప్రభావం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాది నుంచి వీచే చలిగాలుల ప్రభావం తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు పడిపోవడానికి కారణమని వారు అంటున్నారు. ఇక.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూరు(యూ) మండలంలో కనిష్టంగా 9.7డిగ్రీలుగా రికార్డైంది. మరో రెండు రోజులు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.