- రికార్డ్ స్థాయిలో పడిపోతున్న టెంపరేచర్లు
- ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండంటంతో ఉదయం, రాత్రిపూట ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాధారణం కన్నా 4 నుంచి 6డిగ్రీల వరకు తక్కువ టెంపరేచర్లు నమోదవుతున్నాయి.నిన్న అత్యల్పంగా కుమురంభీం జిల్లా సిర్పూరు(యూ) లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్ లో 9.2, మెదక్ లో 10, హైదరాబాద్ నందనవనంలో 11.7 డిగ్రీలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటినా పొగ మంచు తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో గత పదేళ్లలో నవంబర్ నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలు కాగా.. ఆదిలాబాద్ లో 2017లో నమోదైంది. ఇదే విధంగా ఉష్ణోగ్రతలు తగ్గితే.. పాత రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నండటంతోనే చలి తీవ్రత పెరుగుతుందన్నారు.
ఏపీలోనూ చలిపులి పంజా విసురుతోంది. డిసెంబర్ రాకముందే ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పుకుంటోంది. చలి తీవ్రత అనూహ్యంగా పెరుగుతుండడంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఆకాశం మేఘావృతమైపోయింది.
చాలా చోట్ల ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.