గుత్తా కోటరీలో బుగులు! .. ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్

  • తమను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి 
  • నల్గొండ, దేవరకొండ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రహస్య మంతనాలు
  • ఆ పార్టీలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం

నల్గొండ, వెలుగు : శాసన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి కోటరీలో బుగులు మొదలైంది. గుత్తా ప్రభావం చూపే నల్గొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో ఆయన వర్గంగా చలామణి అవుతున్న పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చే రేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఎంతోకాలంగా ఎమ్మెల్యేలకు, గుత్తా వర్గానికి మధ్య కోల్డ్​వార్ నడుస్తోంది. ఇప్పుడు ఎన్నికల టైం కావడంతో అదును చూసే దెబ్బకొట్టాలనే వ్యూహంతో గుత్తా వర్గం ఉన్నట్టు సమాచారం.  కొన్నాళ్లుగా వీరికి  సంబంధించిన పోస్టులు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుండటం ఇందుకు ఊతమిస్తోంది. 

నల్గొండపై ప్రభావం

నల్గొండ సెగ్మెంట్​పరిధిలో తిప్పర్తి, కనగల్​మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతిని ధులు కాంగ్రెస్​లో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గుత్తా సన్నిహితుడు, తిప్పర్తి జడ్పీటీసీ, ఫ్లోర్​లీడర్​ పాశం రామిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డికి మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తోంది.  ఐదేళ్లుగా రామిరెడ్డిని రాజకీయంగా, వ్యక్తిగతంగా డ్యామేజ్ సంఘటనలు తిప్పర్తి మండలంలో చాలా జరిగాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఓ నిర్ణయానికి వచ్చిన ఆయన ఇటీవల మండలంలోని ఇరవై గ్రామాల ముఖ్యలీడర్లతో భేటీ అయినట్టు తెలిసింది. దీంట్లో మెజార్టీ సభ్యులు పార్టీ మారాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.  రామిరెడ్డికి గతంలో జిల్లా కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​పనిచేసిన అనుభవం ఉండడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.  కనగల్​ మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా ఇటీవల ఓ రహస్య ప్రాంతంలో భేటీ అయ్యారు.  ఇప్పటికైనా సరియైన నిర్ణయం తీసుకోకపో తే భవిష్యత్తులో నష్టపోతామనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దసరా తర్వాత మరోసారి చర్చించి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటించనున్నట్లు ఈ భేటీలో పాల్గొన్న నేతలు చెప్పారు. 

దేవరకొండలోనూ అదే పరిస్థితి...

దేవరకొండ మున్సిపల్​ చైర్మన్​ ఆలంపల్లి నర్సింహా, డిండి జడ్పీటీసీ దేవేం దర్​రావు, సీనియర్​ నేత వడ్త్యా దేవేందర్​ నాయక్, మామిడి సర్వయ్య తదితరులు ఎమ్మెల్యే రవీంద్రకుమార్​కు వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. పాత సీపీఐ వాళ్లకే పార్టీ  పదవుల్లో ప్రియారిటీ ఇచ్చి తమను నిర్లక్ష్యం చేశారన్న కోపంతో ఉన్న వీళ్లు ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మీటింగ్‌లు పెట్టి క్యాడర్‌‌తో చర్చించారు.  డిండి జడ్పీటీసీ దేవేంద ర్​రావు ఇటీవల ఎర్రారం గ్రామంలో అసమ్మతి నేతలతో రహస్య మీటింగ్​పెట్టి.. కాంగ్రెస్​ నుంచి బాలూనాయక్‌కు  టికెట్​ వస్తే వీరంతా మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారు.

దీంతో అప్రమత్తమైన పార్టీ మంత్రులు హారీశ్‌​రావు, కేటీఆర్‌‌ను రంగంలోకి దింపించి. వారు దేవేందర్​ రావుతో సహా కీలక నేతలను హైదరాబాద్​కు పిలిచి నామినేటెడ్​ పోస్టు ఇస్తామని భరోసా ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే తప్ప తాము పనిచేయామని వాళ్లు తేల్చి చెప్పారు.చందంపేట మండలానికి చెందిన సర్వయ్య కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. గుత్తా వర్గానికి చెందిన కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్​రావు ఇటీవల కాంగ్రెస్​లో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన గుత్తా సుఖేందర్​ రెడ్డి ఎంత నచ్చజెప్పినా పార్టీ కేడర్​ వినే పరిస్థితుల్లో లేదు. హైకమాండ్​ జోక్యం చేసుకున్నప్పటికీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మళ్లీ గెలిస్తే రాజకీయంగా తాము సమాధి అయినట్టేనని గుత్తా వర్గం భావిస్తోంది.