- పాలక వర్గం వర్సెస్ కమిషనర్
- డ్రైవర్లను తొలగించారని మండిపడుతున్న నేతలు
- ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి రెండు నెలలుగా జీతాల్లేవ్
- రెవెన్యూ లోటుతో మున్సిపాలిటీ సతమతం
గద్వాల, వెలుగు : గద్వాల మున్సిపాలిటీలో కోల్డ్ వార్ ముదురుతోంది. పాలకవర్గం, కమిషనర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పాలకవర్గం కమిషన్ మధ్య విభేదాలతో రెండు నెలల నుంచి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. మున్సిపాలిటీ జనరల్ ఫండ్ వినియోగంలోనూ కొర్రీలు పెడుతున్నారని పాలకవర్గం మున్సిపల్ కమిషనర్ పై మండిపడుతోంది.
ఎవరికీ చెప్పకుండా మున్సిపాలిటీలో పని చేస్తున్న 20 మంది వరకు ఆటో డ్రైవర్లను తొలగించారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్లు ఆఫీస్ కు వెళ్ళినా పట్టించుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ రూల్ పొజిషన్ అంటే సమస్యల పరిష్కారం ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే ప్రతి పనికి నెలలు పడుతుందని, దీంతో ప్రజల్లో పలచనైపోతామని పాలకవర్గం వాదిస్తోంది.
డబ్బులున్నా జీతాలు ఇస్తలేరు..
గద్వాల మున్సిపాలిటీలో 286 మంది వరకు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. వీరికి నెలనెలా జీతాలు ఇవ్వాలి. కానీ రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఒక నెల జీతం అందరికీ కలిపి రూ.42 లక్షల వరకు అవుతుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో కోటికి పైగా నిధులున్నాయి. జీతాలు చెల్లించే అవకాశం ఉన్నా మున్సిపల్ కమిషనర్ చెల్లించకుండా అడ్డు చెబుతున్నారని విమర్శలున్నాయి. జీతాలు లేకుండా తాము ఎలా పని చేయాలని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ పాలకవర్గం, మున్సిపల్ కమిషనర్ కు పడకపోవడంతోనే తమ జీతాలు ఆపారని వాపోతున్నారు.
బిల్లులు రిటర్న్ పంపిస్తున్రు..
మున్సిపాలిటీలో చేసిన చిన్నచిన్న పనులకు సంబంధించి బిల్లులను మున్సిపల్ కమిషనర్ రిటర్న్ పంపిస్తున్నారనే విమర్శలున్నాయి. కౌన్సిలర్లు చేపించిన పనులకు కావాలనే బిల్లులు చేయకుండా కమిషనర్ అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గద్వాల జాతర సమయంలో లింగంబావి, చొక్కం బావికి లైటింగ్, సుందరీకరణ, క్లీనింగ్ తదితర పనులను చేయించారు. రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు బిల్లులు జనరల్ ఫండ్ నుంచి ప్రతీ కమిషనర్ చెల్లించేవారు.
కానీ కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత బిల్లులను రిటర్న్ పంపిస్తున్నారని, ప్రతిదీ రూల్ ప్రకారం పోవాలని చెబుతున్నారని, ఇలా అయితే చిన్న చిన్న పనులు చేసిన వారి పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. జనరల్ ఫండ్ ద్వారా తీసుకోవాల్సిన బిల్లులను ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని మండిపడుతున్నారు. అదే ఇతర వ్యక్తుల ద్వారా చేయించిన పనులకు బిల్లులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
చెత్త ప్రైవేటీకరణపై వార్..
గద్వాల మున్సిపాలిటీలో చెత్త ప్రైవేటీకరణపై ఆఫీసర్లు, మున్సిపల్ పాలకవర్గం మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. గద్వాల టౌన్ లో ఇంటింటికీ తిరిగి ఇది వరకు మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరించేవారు. నాలుగు నెలల కింద వనపర్తికి చెందిన ఏజెన్సీకి చెత్త సేకరణ పనులు అప్పగించారు. ప్రైవేట్ వ్యక్తులు చెత్త సేకరించినందుకు ఇంటింటికీ రూ.60 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిని మున్సిపల్ పాలకవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
మున్సిపల్ మీటింగ్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తి అధికారులను నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులకు చెత్త సేకరణ అప్పగించడంతో మున్సిపాలిటీలో చెత్త సేకరించే 20 మంది కార్మికులను తొలగించారు. ఎంప్లాయూస్ ను తొలగిస్తే ఎలా అని కౌన్సిలర్లు మున్సిపాలిటీ మీటింగ్ లో ఆఫీసర్లను నిలదీశారు. పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆఫీసర్లు చెప్పినా, ఎవరినీ తొలగించవద్దని కౌన్సిల్ లో తీర్మానం చేశారు. అయినప్పటికీ 20 మందిని తొలగించడంతో పాలకవర్గం గుర్రుగా ఉంది. అంతేకాకుండా 286 మందిలో మరి కొంత మందిని కూడా తొలగించాలని చూస్తుండడంతో వివాదానికి దారితీస్తోంది.
విభేదాల్లేవ్..
పాలకవర్గానికి, నాకు విభేదాలు లేవు. మున్సిపాలిటీలో రెవెన్యూ లోటు రాకుండా చూస్తున్నాను. రూల్ పొజిషన్ ప్రకారం ముందుకెళ్తున్నాను. ఎవరికీ ఇబ్బంది లేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు.
-
శంకర్ సింగ్, మున్సిపల్ కమిషనర్
రెవెన్యూ లోటు..
గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదికి రూ.40 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. ఖర్చులు రూ.48 కోట్లకు పైగానే ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు చెల్లించేందుకు నెలకు రూ.42 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చును తగ్గించుకోవాలని ఆఫీసర్లు మున్సిపాలిటీలో ఉన్న ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. దీంతో ఆఫీసర్లకు, మున్సిపల్ పాలకవర్గానికి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.