
- ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థి.. ఇంకొకరు డీసీసీ ప్రెసిడెంట్
వరంగల్, వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా, ఎర్రబెల్లి దంపతుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నిన్నమొన్నటి దాకా కనిపించని లీడర్లు.. ఇప్పుడు కాంగ్రెస్ ఊపుపెరగడంతో ‘అంతా తామే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పోటాపోటీ
మాజీ మంత్రి కొండా సురేఖ ఈసారి వరంగల్ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. సీనియర్ మహిళా నేత, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కొత్తగా వరంగల్ డీసీసీ పోస్ట్ దక్కించుకున్నారు. మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుండగా.. అసలు రాజకీయం తెరవెనక వీరి భర్తలు నడిపిస్తున్నారు. వీరిద్దరి కొండా సురేఖ భర్త మురళీ, ఎర్రబెల్లి స్వర్ణ భర్త వరద రాజేశ్వరరావు పార్టీలో పంతాలకు పోతున్నారు.
పార్టీలో.. నలుగురు సీనియర్లే
కాంగ్రెస్ లో కొండా సురేఖ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా, మురళీ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావు దంపతులు దాదాపు 40 ఏండ్లకు పైగా పార్టీలో ఉన్నారు. స్వర్ణ.. వరంగల్ కార్పొరేషన్ మేయర్‍గా పనిచేశారు. పశ్చిమ నియోజవర్గం నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడు, నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో కొండా, ఎర్రబెల్లి దంపతులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో పార్టీని వీడినప్పటికీ సురేఖకు తూర్పు టికెట్ దాదాపూ ఖాయం చేయగా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వర్ణకు ఇచ్చింది.
ఎవరూ తగ్గట్లే..
వరంగల్ జిల్లా సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నియామకం మరోసారి కొండా, ఎర్రబెల్లి దంపతుల మధ్య ఆధిపత్య పోరును పెంచింది. ‘ మా వాళ్లే సిటీ మహిళా ప్రెసిడెంట్’ పోస్టులో ఉండాలే అన్నట్లు ఎవరికివారే తమ వర్గానికి చెందినవారి పేర్లను ప్రకటింప చేశారు. కొండా వర్గానికి చెందిన నారగోని స్వప్న పేరును రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు శనివారం ప్రకటించారు. దానిని లెక్కలోకి తీసుకోకుండా ఎర్రబెల్లి స్వర్ణ వర్గానికి చెందిన బౌరిశెట్టి శ్రీలత పేరును పార్టీ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ ప్రకటించారు. దీంతో ఈ ఇష్యూ హైదరాబాద్ కు చేరింది. మొత్తంగా పార్టీ విజయం కోసం పనిచేయాల్సిన కొండా, ఎర్రబెల్లి దంపతులు పంతానికిపోతున్నారనే విషయం హైకమాండ్ దృష్టిలో పడింది.
ఎవరికి వారే..
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్కో వర్గానికి ఒక్కో పోస్ట్ కట్టబెడుతోంది. కొండా, ఎర్రబెల్లి దంపతులకు కూడా పదవులు అందుతూ వచ్చాయి. కానీ, పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన చోట ఎవరికివారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిన వ్యక్తికి కాకుండా ఎర్రబెల్లి స్వర్ణకు జిల్లా పార్టీ పీఠం దక్కడంపై కొండా దంపతులు గుర్రుగా ఉన్నారు. ప్రెసిడెంట్‍గా ఎన్నికైన స్వర్ఱ తమకు ఇప్పటికీ కనీసం ఫోన్ చేయలేదని మురళి తెలిపారు. అదే సమయంలో కొండా ఏర్పాటు చేసే ప్రెస్‍మీట్లకు జిల్లా అధ్యక్షురాలు స్వర్ణను పిలవడంలేదు. తూర్పులో తామే సుప్రీం అని భావిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‍లో గౌరవం ఇవ్వకపోవడాన్ని ఎర్రబెల్లి దంపతులు తప్పుపడుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్‍లో ఉండి ఇప్పుడిప్పుడే ఆక్టివ్ అవుతున్న కేడర్ ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
'దశాబ్ది దగా' చేయమంటే.. ఇండ్లు దాటలే..
కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 22న 'దశాబ్ది దగా' పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జిల్లాతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో సీఎం కేసీఆర్ పది తలల దిష్టిబొమ్మల దహనం, రోడ్లపై వంటవార్పు కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. కానీ, కొండా, ఎర్రబెల్లి వర్గాలు..కనీసం ఇండ్లుదాటి బయటకు రాలేదు. దీంతో పార్టీలో, బయట పెద్ద లీడర్ల తీరుపై చర్చ నడిచింది.