ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ 4.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో 4.8 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లెలో, రంగారెడ్డిలోని తాళ్లపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది. రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలితీవ్రత పెరగింది. సికింద్రాబాద్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, కార్వాన్, ఉప్పల్ ప్రాంతాల్లో టెంపరేచర్ భారీగా పడిపోయింది. ఈ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.