- ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
- రానున్న రెండు వారాలు
- ఇలాగే ఉండొచ్చన్న ఐఎండీ
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. అన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఏపీలో తుఫాను, అల్పపీడన ప్రభావంతో వారం రోజులపాటు తగ్గుముఖం పట్టిన చలి.. రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నది. టెంపరేచర్లు సాధారణం కంటే 5 నుంచి 8 డిగ్రీల తక్కువకు పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. 15 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా రికార్డయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
సంగారెడ్డి జిల్లా కోహిర్లోనూ 6.9 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 7.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 7.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 8.5 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 9 డిగ్రీలు, రాజన్నసిరిసిల్ల జిల్లా గజసింగారంలో 9 డిగ్రీలు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 9.1 డిగ్రీలు నమోదయ్యాయి. అదేవిధంగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో 9.6 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్‌లో 9.7 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 9.9 డిగ్రీలు, నారాయణపేట జిల్లా దామరగిద్దలో 10 డిగ్రీలు రికార్డయ్యాయి. ఇక, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 10 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 10.3 నుంచి 13.2 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డయ్యాయి. 9 జిల్లాల్లో 10 నుంచి 11 మధ్య, ఐదు జిల్లాల్లో 11 నుంచి 12 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ సిటీ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బీహెచ్ఈఎల్లో అత్యల్పంగా 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. మౌలాలిలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ALSO READ : వరి నాట్లకు..నార్త్ ఇండియా లేబర్..పల్లెల్లోకి బిహార్, యూపీ, బెంగాల్ కూలీల ఎంట్రీ
వణికిపోతున్న దక్షిణ తెలంగాణ జిల్లాలు
రాష్ట్రంలో రానున్న రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ విడుదల చేసిన వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌లో టెంపరేచర్లు పడిపోతాయని వివరించింది. రెండోవారంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అయితే, ఈ నెల 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అది నాలుగు రోజుల్లో శ్రీలంకవైపు వెళ్లి తీరం దాటుతుందని పేర్కొంది. ఆ అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంటుందని తెలిపింది.