సంగారెడ్డిలో 6 డిగ్రీలు.. తెలంగాణలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు

సంగారెడ్డిలో 6 డిగ్రీలు.. తెలంగాణలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు
  • రాష్ట్రంలో మరింత పడిపోయిన రాత్రి టెంపరేచర్లు
  • ఐదు జిల్లాల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్యే రికార్డ్
  • మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో చలి మరింత పెరిగింది. శుక్రవారం రాత్రి టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. ఐదు జిల్లాల్లో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్యే ఉష్ణోగ్రతలు రికార్డు కాగా.. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే నమోదయ్యాయి. రాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ఏరియాలకు మించి దక్షిణాది జిల్లాల్లో చలి తీవ్రత నమోదవుతున్నది. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్​లో 6.1డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 6.2, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 6.8, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.8, వికారాబాద్​ జిల్లా మోమిన్​పేటలో 7.8, మెదక్​ జిల్లా బోడగాట్​లో 8.4, మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​లో 8.4, నిర్మల్​లోని కుబీర్​లో 8.8, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్​లో 9.2, రాజన్నసిరిసిల్ల గజసింగారంలో 9.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్​లో 9.5, జయశంకర్​ భూపలపల్లి జిల్లా ముత్తారంలో 9.8, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 9.9, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 10 నుంచి 13 డిగ్రీల మధ్యే రాత్రి టెంపరేచర్లు రికార్డు కావడం గమనార్హం. 8 జిల్లాల్లో 10 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలోని బీహెచ్​ఈఎల్​ వద్ద 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

తొమ్మిదేండ్ల కనిష్ఠం..

సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత తొమ్మిదేండ్ల కనిష్ఠ స్థాయిలో రికార్డయింది. 2015 జనవరి 10న కోహిర్​లో 2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు 6 డిగ్రీలుగా రికార్డ్​ అయింది. ఈ తొమ్మిదేండ్లలో అక్కడ నమోదైన అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. టెంపరేచర్లు మరింత పడిపోతాయని హెచ్చరించింది. ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో దక్షిణాదిలోనూ చలి తీవ్రత పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.