తెలంగాణలో పెరుగుతున్న చలి

  • 7 జిల్లాల్లో 10 కన్నాతక్కువ టెంపరేచర్లు
  • కుమ్రంభీం జిల్లా సిర్పూర్​లో 8.1 డిగ్రీలు

హైదరాబాద్, వెలుగు: చలి తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో టెంపరేచర్లు మరింత పడిపోయాయి. ఏడు జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలు ఆరెంజ్​ అలర్ట్​లో ఉన్నాయి. మరో నాలుగు జిల్లాల్లో 10.1 నుంచి 10.9 డిగ్రీల మధ్య రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. మిగతా జిల్లాల్లో 11 నుంచి 18 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. 20 జిల్లాలు ఎల్లో అలర్ట్​లో ఉన్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్​లో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

 సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​లో 8.2, ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​లో 8.2, మెదక్​ జిల్లా శివంపేటలో 8.9, నిజామాబాద్​ జిల్లా కోటగిరిలో 9.7, కామారెడ్డి జిల్లా జుక్కల్​లో 9.7, వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 10 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో 10.4, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 10.6, సిద్దిపేట జిల్లా అక్బర్​పేటలో 10.9, నిర్మల్​ జిల్లా పెంబిలో 10.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు 
రికార్డయ్యాయి. 

3 రోజులు మోస్తరు వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్​ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహ బూబాబాద్​, వరంగల్​, హనుమకొండ జిల్లాల్లో వర్షం పడవచ్చని పేర్కొంది. 

ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా, సోమవారం కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.