వామ్మో చలి.. పొద్దు పొడిచినా.. వణుకుతున్నారు..

వామ్మో చలి.. పొద్దు పొడిచినా.. వణుకుతున్నారు..

తెలంగాణలో  చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. చలితో పాటు పొగ మంచు అధికంగా ఉంటోంది. పొగమంచు తెల్లవారుజామున ప్రారంభమై పది గంటల వరకూ ఉంటున్నది. దీంతో ఉదయం పూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లేవారు మాస్కులు ధరించాల్సి వస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

రానున్న రెండు రోజుల పాటు  ( జనవరి 20 నుంచి) కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ( జనవరి 19)  ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా.. 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్ చెరులో 11, మెదక్ 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5, హన్మకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్ 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.