PSL 2025: బౌలింగ్‌ యాక్షన్‌పై గ్రౌండ్‌లోనే ఆరోపణలు.. మున్రోపై దూసుకొచ్చిన రిజ్వాన్, ఇఫ్తికార్

PSL 2025: బౌలింగ్‌ యాక్షన్‌పై గ్రౌండ్‌లోనే ఆరోపణలు.. మున్రోపై దూసుకొచ్చిన రిజ్వాన్, ఇఫ్తికార్

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో గ్రౌండ్ లోనే పెద్ద గొడవ జరిగింది. బుధవారం (ఏప్రిల్ 23) ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాటర్ కొలిన్ మున్రో, ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఇఫ్తికర్ అహ్మద్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్ యాక్షన్‌ రూల్స్ కు విరుద్ధంగా ఉందని మున్రో చెప్పడంతో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ మూడో బంతిని ఇఫ్తికర్ యార్కర్ ను వేశాడు. బ్యాటింగ్ చేస్తున్న మున్రో బంతిని డిఫెండ్ చేశాడు. ఈ బంతిని ఆడిన వెంటనే ఇఫ్తికర్ వైపు చూస్తూ నీ బౌలింగ్ చెక్ చేసుకో అని సూచించాడు.

ఒక ఆటగాడు బౌలింగ్ యాక్షన్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అంపైర్ ను సంప్రదించాలి. కానీ మున్రో మాత్రం సరాసరి బౌలర్ వైపు చేయి చూపిస్తూ మాట్లాడడం విశేషం. మున్రో మాటలకు ఇఫ్తికర్ కు పట్టలేని కోపం వచ్చింది. అతడితో నీకెందుకు.. నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా గట్టిగా అరిచాడు. మధ్యలో అంపైర్ జోక్యం చేసుకుంటూ ఉండగా.. ముల్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన సహచరుడు ఇఫ్తికర్ కు సపోర్ట్ చేస్తూ ఫైరయ్యాడు. అంపైర్లు ఆటను ఆపకూడదని.. ఆరోపణపై తక్షణ చర్య తీసుకోకూడదని మున్రోకి చెప్పి అతన్ని బ్యాటింగ్ కొనసాగించమని కోరారు. 

అప్పటివరకు 28 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్న మున్రో..ఆ తర్వాత ఓవర్ లోనే  మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనింగ్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 80 పరుగులు చేయడంతో ఇస్లామాబాద్ యునైటెడ్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 168 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ 17.1 ఓవర్లలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి గెలిచింది.