కుప్పకూలిన గ్రీన్​ఫీల్డ్​ హైవే బ్రిడ్జి

వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ11వ వార్డు సోమవరం వద్ద  నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జిపై సిమెంటు కాంక్రీట్ స్లాబ్ పోస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడే పని చేస్తున్న  మహారాష్ట్ర, రాజస్థాన్​లకు చెందిన నలుగురు కూలీలు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108లో వైరాలోని ప్రైవేట్ ​హాస్పిటల్​కు తరలించారు.

ఖమ్మం రింగ్​రోడ్డు నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు గ్రీన్​ఫీల్డ్​ హైవే నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదిన్నర కింద సోమవరం వద్ద బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. గ్రీన్​ఫీల్డ్​ హైవే ప్రాజెక్టును పలువురు సబ్ ​కాంట్రాక్ట్​కు తీసుకుని పనులు చేస్తున్నారు. ఖమ్మం నుంచి పెనుబల్లి వరకు ఉన్న 33 కిలోమీటర్ల పనులను రూ.722 కోట్లతో ఓ సబ్ ​కాంట్రాక్టర్​ చేస్తున్నాడు. అయితే, నాసిరకం మెటీరియల్ ​వాడడం  వల్లే  స్లాబ్ పోస్తుండగా కుప్పకూలిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.  బ్రిడ్జి కూలిపోతున్న టైంలో కూలీలు గమనించి దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది.