రాళ్లవాగుపై కుంగిన బ్రిడ్జి

రాళ్లవాగుపై కుంగిన బ్రిడ్జి
  •     భద్రాచలం- వాజేడు రూట్ లో వాహనాల నిలిపివేత
  •     ఓవర్ లోడ్ తోనే కుంగినట్టు తేల్చిన ఆర్అండ్ బీ ఆఫీసర్లు

వెంకటాపురం, వెలుగు :  భద్రాద్రి – ములుగు జిల్లాల సరిహద్దు వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద రాళ్లవాగుపై నిర్మించిన వంతెన గురువారం రాత్రి కుంగిపోయింది.  భద్రాచలం – వాజేడు వెళ్లే రాష్ట్ర రహదారిపై నాలుగు దశాబ్దాల కింద వంతెన నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో ఒకే సెంటర్ పిల్లర్ ఏర్పాటు చేశారు. దానిపై బీమ్ నిర్మించి స్లాప్ వేశారు. భద్రాచలం వైపున బ్రిడ్జి పిల్లర్ బీమ్, స్లాబ్ దెబ్బతిని 10 మీటర్ల మేర వంతెన కృంగింది.

 ఈ విషయం తెలిసిన అధికారులు తహసీల్దార్ లక్ష్మణ స్వామి, ఎస్ఐ కొప్పుల తిరుపతి అదే రోజు రాత్రి బార్కెట్లు ఏర్పాటు చేసి రాకపోకలు బంద్ చేశారు. కాగా శుక్రవారం కలెక్టర్ ఆదేశాలతో ఆర్ అండ్ బీ ఎస్ సీ వెంకటేశ్వర్లు అధికారులతో వెళ్లి బ్రిడ్జిని తనిఖీ చేశారు. భారీ వాహనాల కారణంగానే దెబ్బతిన్నదని తెలిపారు. బ్రిడ్జి కుంగిన ప్రాంతంలో కొలతలు తీసుకున్నామని.. త్వరలోనే ఉన్నతాధికారుల పర్మిషన్ తో పునరుద్ధరిస్తామని చెప్పారు.