- మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
- నటి ప్రియాంక మోహన్ కు తృటిలో తప్పిన ప్రమాదం
- మహబూబాబాద్ జిల్లాతొర్రూరులో ఘటన
తొర్రూర్: ఓ బట్టల షాపు ఓపెనింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. ఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసిన స్టేజీ కుప్పకూలడంతో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు స్థానికంగా ప్రాథమిక చికిత్సలు చేయించి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరులో చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినీ నటి ప్రియాంక మోహన్ తృటిలో తప్పించుకున్నారు.
స్టేజీపైకి ఎక్కిన నటి ప్రియాంక మోహన్, ఝాన్సీ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఝాన్సీ రెడ్డి అత్త. ప్రస్తుతం ఆమె పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేయాలని ఝాన్సీ రెడ్డి భావించారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ ఝాన్సీ రెడ్డిని రంగంలోకి దించేందుకు పక్కాప్లాన్ చేసింది.
అయితే చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై వివాదం చెలరేగింది. ఆమె ఎన్ఆర్ఐ పౌరసత్వం కారణంగా సమస్యలు వస్తాయని భావించి కోడలు యశస్వినీ రెడ్డిని బరిలోకి దింపారు. ఎర్రబెల్లిపై ఆమె విజయం సాధించారు. ఝాన్సీ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు.