కునారిల్లుతున్న ప్రభుత్వ విద్య

వంద(106) సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రభుత్వ నిరాదరణ, ఉదాసీన వైఖరిని ఓయూ ప్రొఫెసర్​ఒకరు ప్రముఖ దినపత్రికలో ఇటీవల వ్యాసం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల పరిస్థితులు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నష్టపోయిన, నిరాదరణకు గురైన రంగాల్లో విద్యారంగం ప్రధానమైనదని మేధావులు, ఉద్యోగులు పెడుతున్న గగ్గోలు నూటికి నూరు శాతం నిజం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధికి వ్యూహాత్మక కృషి చేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి రాష్ట్రమంతటా తిరిగి మన ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మీడియా ద్వారా సమాజానికి తెలియజేశారు. తెలంగాణ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డారు. అనేకమంది మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు నాటి ప్రభుత్వ నిర్బంధాలను, అణిచివేతను, వివక్షను ఎదుర్కొని, శిక్షలు భరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ విద్యాసంస్థలు స్వరాష్ట్రంలో అభివృద్ధికి నోచుకుంటాయని ఎంతో ఆశించే నాడు ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు అవుతున్నా విద్యాలయాల పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దిగజారింది.

పేద బిడ్డల విద్యాలయాలు

వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా, 50 సంవత్సరాలకు దగ్గరవుతున్న కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల పేద బిడ్డల(90 శాతం రాష్ట్ర జనాభా) విద్యా అవసరాలు తీర్చడంలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నాయి. వెనుకబడిన కులాలు(52%), షెడ్యూలు కులాలు(16%), షెడ్యూలు తెగలు (7%),  మైనారిటీలు(16%) ఇతర ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల విద్యార్థులు పూర్తిగా ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల, కళాశాలలు, పాఠశాలలపై ఆధారపడి చదువుకుంటున్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకురుకుతున్నదని పాలకులు ఎంత ఊదరగొట్టినా, ఈ సామాజిక వర్గాలు ఇప్పటికీ అనేక విషయాల్లో ఇక్కట్లు పడుతున్నవారే. 

ఈ కుటుంబాల నుంచి ఎదుగుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలను కనీసం కొన్ని కాలాలపాటు మిగిలి ఉంచాలి కదా. ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న లక్షలాది రూపాయల ఫీజులు పేద వర్గాల ప్రజలు భరించలేక, నాణ్యమైన విద్య కొనుగోలు చేయలేక విద్యకు దూరమై, ఉపాధి దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుపెట్టే ప్రభుత్వం పట్టుమని పదివేల కోట్ల రూపాయలు విశ్వవిద్యాలయాలకు, ఇతర విద్యాసంస్థలకు సమకూర్చలేదా? ఏటికేడు విద్యకు రాష్ట్ర బడ్జెట్​లో నిధుల కేటాయింపు ఎందుకు తగ్గుతున్నది? కేటాయించిన నిధుల్లో కూడా మొత్తం మంజూరు చేయడం లేదు. పేద వర్గాల విద్యా వ్యవస్థపై నిజాం కాలం లాగనే వ్యతిరేక విధానం ప్రస్తుత పాలకులు అవలంబిస్తున్నట్లున్నది. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రస్తుత ప్రభుత్వ విధానమని తెలంగాణ విద్యావంతులు భావిస్తున్నారు. ఒక ప్రభుత్వ విద్యా ఉన్నతాధికారి, మరో ప్రైవేటు విశ్వవిద్యాలయ అధినేత ఈ పాత్ర అమలు చేస్తున్నట్టుగా అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు, బాధితులు చెప్పుకుంటున్నారు.

ప్రతిపక్షాలైనా స్పందించాలి

ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ ఫీజు రియింబర్స్​మెంట్, ఉపకార వేతనాలు ఇచ్చిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ప్రాజెక్టులు, సెక్రటేరియట్, కలెక్టరేట్ భవనాలు, మాత్రమే సర్వం అని భావిస్తే సరిపోదు. నిజమైన అభివృద్ధి విద్యాసంస్థల్లో జరుగుతుందని మన మొదటి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ అనేక సందర్భాల్లో చెప్పిన మాటలిప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది సంఖ్య 24 శాతానికి పడిపోయింది. కేయూలో ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లో అధ్యాపకులు అసలే లేని కారణంగా అక్కడ ఎంఎడ్ కోర్సును రద్దు చేస్తున్నట్లు ఎన్​సీటీఈ ప్రకటించింది. 

ఒక్కో డిపార్ట్​మెంట్​లో 25 నుంచి 30 మంది అధ్యాపకులు/ప్రొఫెసర్ల అవసరం ఉండగా శాశ్వత ప్రతిపాదికన ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు, పరిశోధకులు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నత అధికారులుగా ఉన్నారు. వారికి విశ్వవిద్యాలయాల, ఉన్నత విద్యా సంస్థల సమస్యలు తెలిసినప్పటికీ పెదవి విప్పి చెప్పలేని దురవస్థలో ఉన్నారు. రాష్ట్రంలో30 వేల ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు అరకొర నిధులతో సిబ్బంది నియామకాలు లేక మౌలిక వసతులు కరువై సమస్యల ఊబిలో ఉన్నాయి. కమీషన్లు లభించే ప్రాజెక్టులు, ఇసుక, గ్రానైటు, భూముల వ్యాపారాలు, రియల్​ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాలు పట్ల చూపిన శ్రద్ధ మన నాయకులు పేద ప్రజల విద్యాసంస్థలు అభివృద్ధికి చూప లేకపోతున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు తప్ప మిగిలిన అనేక నియోజకవర్గాల్లో సర్కారు బడులు సమస్యల నిలయాలుగా ఉన్నాయి. మరో నాలుగైదు ఏండ్లలో బడులను పూర్తిగా మూసివేసి ఆ భూములను అమ్మకం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుందేమో! తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే పేద ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి ఉద్యమంలో పనిచేసిన వర్గాలకు తీవ్ర మనస్థాపం కలిగిస్తున్న అంశాల్లో కునారిల్లుతున్న విద్యావ్యవస్థ ఒకటి. నెల్సన్ మండేలా ఒక సందర్భంలో చెప్పినట్లుగా ఏదైనా సమాజాన్ని నాశనం పట్టించాలంటే కేవలం ఒక ఉన్నత విద్యా వ్యవస్థను నాశనం పట్టిస్తే సరిపోతుందన్నట్లు ఉన్నది మన దగ్గర పరిస్థితి. త్వరలో రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు జరగనున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్షాలు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన వామపక్షాలు ప్రభుత్వ విద్యాసంస్థలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పునర్నిర్మాణం చేసే దిశలో నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. 

ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం

గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏ యూనివర్సిటీలోనూ ఒక్క అధ్యాపకుడిని కూడా నియమించకపోవడమే అందుకు నిదర్శనం. వర్సిటీలతోపాటు కాలేజీలు, స్కూళ్లలో పనిచేసే బోధనా సిబ్బంది వేల సంఖ్యలో రిటైర్​అయ్యారు. ఎన్నో ఖాళీలు ఏర్పడ్డా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ విద్యాలయాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు, సమాజానికి విశ్వాసం తగ్గిపోయేలా చేసి.. పరోక్షంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలో అరడజను ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పుకునేందుకు అస్మదీయులకు అనుమతి ఇచ్చి, విద్యారంగాన్ని  ప్రైవేటీకరణ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతున్నది. 

ఇటీవల మరో ఆరు విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వడానికి శాసనసభ ఆమోదించి బిల్లును రాష్ట్ర గవర్నర్​కు పంపగా రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. గవర్నర్ ​ప్రజల ఆకాంక్షల మేరకు ఆ బిల్లును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. అయినా ప్రతిపాదిత యూనివర్సిటీల యాజమాన్యాలు వేలాదిమంది విద్యార్థులను ప్రేరేపించి అడ్మిషన్లు కూడా చేసుకున్నదంటే రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ఎంత వేగంగా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి ఉత్సాహంగా చెబుతారు. ప్రభుత్వ వర్సిటీలను నిర్లక్ష్యానికి గురి చేసి ప్రైవేటు యూనివర్సిటీలకు ఎందుకు రెడ్​కార్పెట్​వేస్తున్నారో సమాధానం చెప్పరు? తెలంగాణ రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాల పాటు కారు చౌకగా లీజుకిచ్చిన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో గమనించాలి. వందలాది సంవత్సరాల నుంచి కాపాడిన హైదరాబాద్ చుట్టుపక్కల రైతుల,  ప్రభుత్వ భూములను ఫార్మా కంపెనీలకు క్విడ్ ప్రోకో(నీకింత నాకింత) పద్ధతి ద్వారా అన్యాక్రాంతం చేయడం దేనికి సంకేతం అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
-

కూరపాటి వెంకట నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్​