ఏసీబీ పేరుతో ఆర్‌‌ఐకి టోకరా

ఏసీబీ పేరుతో ఆర్‌‌ఐకి టోకరా

కొత్తగూడ, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ పేరుతో తహసీల్దార్‌‌కు ఫోన్‌‌ చేసి వివరాలు సేకరించిన అనంతరం ఓ ఆర్‌‌ఐని బెదిరించి రూ. 35 వేలు వసూలు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కొత్తగూడ తహసీల్దార్‌‌ రమాదేవికి వారం రోజుల కింద 09611184583, 07259011291 నంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌‌ చేశాడు. 

లిఫ్ట్‌‌ చేయగానే తాను ఏసీబీ డీఎస్పీనంటూ చెప్పి మండల, ఉద్యోగుల వివరాలు, ఆఫీస్‌‌లో ఎవరెవరు పనిచేస్తున్నారు..? సీనియర్లు ఎవరు..? ఆర్‌‌ఐలు ఎంత మంది..? అంటూ ఆరా తీశాడు. దీంతో తహసీల్దార్‌‌ ఆర్‌‌ఐ పరమేశ్వర్‌‌ పేరు చెప్పడంతో అతడికి కాన్ఫరెన్స్‌‌ కలపాలని సూచించడంతో ఆమె పాల్వంచలో ఉన్న ఆర్‌‌ఐని కాన్ఫరెన్స్‌‌లోకి తీసుకున్నారు. 


అతడితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత.. తహసీల్దార్‌‌ ఫోన్‌‌ కట్‌‌ చేసి ఆర్‌‌ఐతో పర్సనల్‌‌గా మాట్లాడారు. ఈ క్రమంలో ఆఫీస్‌‌, పనుల వివరాలు అడుగుతూ ‘నీవు ఎవరెవరి వద్ద ఎంత వసూలు చేశావో మా వద్ద లిస్ట్‌‌ ఉంది.. మీ ఇంటి ముందు ఏసీబీ ఆఫీసర్లు ఉన్నారు’ అని చెప్పాడు. దీంతో తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, నిజాయితీగా పనిచేస్తున్నానని ఆర్‌‌ఐ చెప్పినా వినకుండా మరో అరగంటలో నిన్ను అరెస్ట్‌‌ చేస్తాం అని బెదిరించారు. ఆర్‌‌ఐ ఆందోళనకు గురి కావడంతో పక్కనే ఉన్న అతడి భార్య ఫోన్‌‌ తీసుకొని మాట్లాడింది. దీంతో రూ. 5 లక్షలు ఇస్తే ఆర్‌‌ఐని వదిలేస్తామని చెప్పారు. 


తమ వద్ద అంత డబ్బు లేదని, బ్యాంక్‌‌ అకౌంట్‌‌లో రూ. 35 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో ఆ డబ్బులను ఫోన్‌‌ పే చేయాలని సూచించడంతో వారు చెప్పిన నంబర్‌‌కు డబ్బులను ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆర్‌‌ఐ అల్లుడు రావడంతో విషయం తెలుసుకున్న అతడు డబ్బులు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసిన నంబర్‌‌కు ఫోన్‌‌ చేశాడు. ఓ వ్యక్తి ఫోన్‌‌ లిఫ్ట్‌‌ చేసి తనకు మా సార్‌‌ డబ్బులు వేశాడంటూ చెప్పి ఫోన్‌‌ కట్‌‌ చేశాడు. తర్వాత మరోసారి ఫోన్‌‌ చేయగా స్విఛాఫ్‌‌ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆర్‌‌ఐ వెంటనే సైబర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.