- గ్రామ గ్రామానా ప్రత్యేక టీమ్‌లు, జనభాకు తగ్గట్టు కౌంటర్లు
యాదాద్రి, వెలుగు : ప్రజాపాలనకు జిల్లా ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం నుంచి 'అభయహస్తం' పేరుతో ప్రజాపాలన అప్లికేషన్లను తీసుకోవాలన్నారు. జనవరి 6 వరకూ నిర్వహించే గ్రామసభల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అప్లికేషన్లను తీసుకుంటారు.
యాదాద్రిలో 525 గ్రామసభలు : జిల్లాలోని 17 మండలాల్లో 421 పంచాయతీలు ఉన్నాయి. ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే 525 గ్రామసభల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 37 టీమ్స్, అర్బన్‌లో 14 టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2.14 లక్షల కుటుంబాలు ఉన్నట్టు అంచనా. ప్రతి కుటుంబం నుంచి అప్లికేషన్ స్వీకరించాలన్న ఉద్దేశంతో 2.40 లక్షల అప్లికేషన్లను ప్రింట్ చేయించారు. ఈ అప్లికేషన్లను ప్రతి ఇంటికి ముందుగానే అందిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు 1990 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్కో కౌంటర్‌కు ఇన్చార్జ్, అసిస్టెంట్‌ను నియమించడంతో 4 వేల మందికి పైగా స్టాఫ్ ను నియమించారు. కౌంటర్లతో పాటు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి అప్లికేషన్లను పూర్తి చేయడానికి సహాయకులుగా జీపీ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, విలేజ్ బుక్ కీపర్లు సహాయపడతారు. ఐదు గ్యారెంటీల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లతో పాటు గ్రామాల్లో ప్రత్యేకంగా జనరల్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాపాలన అప్లికేషన్ల స్వీకరణపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ హనుమంతు జెండగే ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం గ్రామసభలను నిర్వహించాలని సూచించారు.
పక్కా ప్రణాళికతో ప్రజాపాలన : జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక
సూర్యాపేట : జిల్లాలో ప్రజా పాలన పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తో కలసి ప్రజాపాలన నిర్వహణ పై మీడియా సమావేశం నిర్వహించారు. పక్కా ప్రణాళికతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు,మున్సిపాలిటీలలో ప్రజా పాలన కార్యక్రమం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
మొదట రోజు 116 గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అలాగే ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 475 గ్రామ పంచాయతీల్లో 247 సభ్యులతో 46 టీమ్స్ , 2581 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 5 మున్సిపాలిటీల్లో 141 వార్డులలో 52 సభ్యులతో 12 టీమ్స్, 299 సభ్యులతో 58 టీమ్స్, 3425 కౌంటర్లను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ రమేశ్ కుమార్, డీఈ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ : జిల్లాలో మొదటి రోజున 158 గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఒక టీమ్ సభ్యులు రెండు గ్రామాలు పర్యటిస్తారు. మేజర్ పంచాయతీలు ఉంటే రోజు మొత్తం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు అందజేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.
గ్రామాలు, పట్టణంలో ప్రజా పాలన కార్యక్రమంపై ప్రజలకు విస్తృత ప్రచారం కలిగించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాపాలన నోడల్ అధికారిగా హెల్త్ డైరక్టర్ ఆర్ వి. కర్ణన్‌ను ప్రభుత్వం నియమించింది. జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ సుహాసిని, ఏజేసీ జె. శ్రీనివా స్ ప్రజాపాలన ప్రత్యే క అధికారులు, వారికి కేటాయించిన నియోజకవర్గ పరిధిలోని బుధవారం శిక్షణ ఇచ్చారు.