కోస్గి, వెలుగు : కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు మండలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'కాడ'ను ఏర్పాటు చేసిందని, అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష సూచించారు. గురువారం కోస్గి తహసీల్దార్ ఆఫీస్లో అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ స్థలాల గుర్తింపుపై 'కాడ' ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, ఉపాధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నారాయణపేట, వికారాబాద్ జిల్లాలను అనుసంధానం చేస్తూ రోడ్ల వెడల్పునకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి వరకు ఆమోదం పొంది ప్రారంభం కాని పనులను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మనబడి పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకుఆదేశించారు. కలెక్టర్ వెంబడి డీఈఓ అబ్దుల్ ఘనీ, తహసిల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ చికినె శశిధర్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.