తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ధాన్యం తూకంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బందుదులకు గురిచేస్తే మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జీలపై చర్యలు తీసుకుంటామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల హెచ్చరించారు.గురువారం కలెక్టరేట్​లో ధాన్యం కొనుగోళ్లపై పలు శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ యాసంగి నుంచి ఐరీస్​ ద్వారా ధాన్యం సేకరణ పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 128 ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ గ్రేడ్​ ధాన్యం క్వింటాకు రూ. 2,203, బీ గ్రేడ్​ రకానికి రూ. 2,183 మద్దతు ధర చెల్లించనున్నట్టు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ధాన్యం మద్దతు ధరలు, నాణ్యతా ప్రమాణాలతో రూపొందించిన వాల్​ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​, డీఆర్డీవో విద్యాచందన, పౌరసరఫరాల సంస్థ మేనేజర్​ త్రినాథ్​, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, డీసీవో కుర్షీద్​, డీఏవో బాబూరావు తదితరులు  పాల్గొన్నారు.