పార్లమెంట్​ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : సిక్తా పట్నాయక్

  • కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ప్రావీణ్య
  • సీపీ అంబర్​ కిశోర్​ ఝాతో కలిసి సమావేశాలు

హనుమకొండ/ వరంగల్  వెలుగు: రానున్న పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు  పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ప్రావీణ్య స్పష్టం చేశారు. ఈ మేరకు వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా తో కలిసి ఆదివారం వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ  కలెక్టరేట్​  కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ మాట్లాడుతూ మే 13న  పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

వరంగల్ పార్లమెంట్​ కు  సంబంధించి   పరకాల నియోజకవర్గంలో   239 పోలింగ్ కేంద్రాలు, వరంగల్ పశ్చిమలో 244 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.  రూ. 50 వేలపైబడి నగదు తీసుకెళ్తూ పట్టుబడితే మాత్రం సంబంధిత పత్రాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు.  వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు మూడు కంపెనీల కేంద్ర బలగాలు  వచ్చాయని, 10 కంపెనీల వరకు  కేంద్ర బలగాలు  వస్తాయన్నారు.

కేంద్ర బలగాలతో సమస్యాత్మక  ప్రాంతాలలో రూట్ మార్చ్  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వై.వి గణేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రలోభాలకు గురి చేస్తే సీరియస్​ యాక్షన్​

 ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంలాంటివి చేస్తే  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వరంగల్ కలెక్టర్​ ప్రావీణ్య హెచ్చరించారు.  మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమన్నారు. రాజకీయ పార్టీలు,  నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందన్నారు.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

 రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించొద్దని  కలెక్టర్ సూచించారు.  ఎన్నికల  ఫిర్యాదులను ప్రజలు 1950 నెంబర్​ లేదా 0870 2530811 నెంబర్​ లోనైనా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.  జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులను  స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల్లో ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారన్నారు.  

కోడ్​ ​ను పటిష్టంగా అమలు చేయాలి :కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ : జిల్లాలో మోడల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​   చేయాలని    కలెక్టర్ ​,ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు.  కలెక్టరేట్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మహబూబాబాద్​ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం ఓటర్లు 1528419  మంది పురుష ఓటర్లు, 745554, మహిళా ఓటర్లు781339 , థర్డ్ జండర్స్ 105, సర్వీస్ ఓటర్లు 1421 ఉన్నట్లు తెలిపారు.పార్లమెంట్ పరిధిలోని 1158 ప్రాంతాలలో 1783 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు  చేసినట్టు తెలిపారు.    ఫేక్ న్యూస్ లు సృష్టిస్తే ఎన్నికల సంఘం గైడ్ లైన్స్​ ప్రకరారం చర్యలు తీసుకుంటామన్నారు.