ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు

ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు
  •     ఎంపీడీవోగా చలామణి అవుతూ పేదలను మోసం చేస్తున్న వ్యక్తి
  •     8న సత్తుపల్లి ఎమ్మెల్యే చేత శంకుస్థాపన చేయించిన నిందితుడు  
  •     ఎంక్వైరీ చేయడంతో బయటపడ్డ  బాగోతం

పెనుబల్లి, వెలుగు : తాను ఎంపీడీవోగా పనిచేసి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యానని, ఎన్‌‌‌‌‌‌‌‌జీవో తరఫున పేదలకు ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ నమ్మించి ఏకంగా ఎమ్మెల్యే చేతనే శంకుస్థాపన చేయించాడు. తర్వాత పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వీఎం.బంజరు ఎస్సై వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ జిల్లా వీర్లపాడుకు చెందిన అద్దంకి జనార్దన్‌‌‌‌‌‌‌‌రావు పేదలకు ఇండ్లు కట్టిస్తామంటూ వసూళ్లు చేస్తున్నాడు. ఇటీవల ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు వచ్చి తాను ఏపీలోని మచిలీపట్నం ఎంపీడీవోగా పనిచేసి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యానని, ఎన్‌‌‌‌‌‌‌‌జీవో తరఫున గ్రామంలో 30 కుటుంబాలకు ఇండ్లు కట్టించి ఇస్తామని నమ్మించాడు. తర్వాత ఈ నెల 8న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌‌‌‌‌‌‌‌ చేత గ్రామంలో శంకుస్థాపన సైతం చేయించాడు. 

అయితే జనార్దన్‌‌‌‌‌‌‌‌రావుపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే అతడి గురించి ఎంక్వైరీ చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో అతడి బాగోతం బయటపడింది. గతంలో ఇలాగే పలువురిని మోసం చేయడంతో ఇతడిపై ఏపీలో 7, ఖమ్మం రూరల్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఒక చీటింగ్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు అయినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో అతడి కోసం గాలింపు మొదలు పెట్టారు. జనార్దన్‌‌‌‌‌‌‌‌రావు మరోసారి కుప్పెనకుంట్లకు వచ్చి ఇండ్లు కట్టించేందుకు ఒక్కొక్కరు రూ. నాలుగు వేలు ఇవ్వాలని గ్రామస్తులకు చెప్పాడు. ఇలా నలుగురి వద్ద నుంచి రూ. 16 వేలు తీసుకుంటుండగా విషయం తెలుసుకున్న వీఎం బంజరు పోలీసులు అతడిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. గతంలో కూడ స్టూడెంట్లకు స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు ఇప్పిస్తానని, తనకు పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, పీసీరావు అనే ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ద్వారా డబ్బులు వస్తాయంటూ ప్రజలను నమ్మించి 1992 నుంచి మోసాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద రూ. 16 వేలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌‌‌‌‌‌‌‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.