- నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు రీఅసెస్మెంట్ చేయని బల్దియా
- రెవెన్యూ సిబ్బంది, ఆఫీసర్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు
- ఏటా ఫిబ్రవరి, మార్చిలో హడావిడి చేసి వదిలేస్తున్న వైనం
- కోట్లాది రూపాయల బల్దియా ఆదాయానికి గండి
కరీంనగర్–వేములవాడ రోడ్డులోని పద్మానగర్‌లో కరీంనగర్ డెయిరీ ప్లాంట్ సుమారు ఏడున్నర ఎకరాల్లో ఉంది. ఇందులో డెయిరీ ఆఫీసు బిల్డింగ్స్, సీడ్ ఫ్యాక్టరీ రూమ్, మిల్క్ స్టోర్ రూమ్ లు, ప్లాంట్, 12 రెసిడెన్షియల్ క్వార్టర్స్ తోపాటు మెయిన్ రోడ్డు వైపు 34 షెట్టర్లు కలిపి మొత్తం 62 ఇంటి నంబర్లపై కలిపి ఆర్నెళ్లకు రూ.43,693, ఏడాదికి రూ.87,386 మాత్రమే వసూలవుతోంది. పద్మానగర్ ఏరియా రెండేళ్ల కింద కార్పొరేషన్‌లో విలీనంగా కాగా.. ట్యాక్స్‌లు మాత్రం జీపీగా ఉన్నప్పటివే కొనసాగుతున్నాయి. రెవెన్యూ విభాగం అధికారులు రీఅసెస్ మెంట్ చేసి ట్యాక్స్ వేస్తే రూ.20 లక్షల మేర వసూలయ్యే అవకాశముంది.
అలుగనూరు, సదాశివపల్లి పరిధిలో 15 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ రెండు గ్రామాలు 2019లోనే కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. ఈ గ్రామాల్లోని కమర్షియల్ బిల్డింగ్స్‌కు, మిల్లులకు 2022 నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం.. ప్రాపర్టీ ట్యాక్స్ విధించాల్సి ఉంది. కానీ సిబ్బంది రీఅసెస్ మెంట్ చేయకపోవడంతో ఇంకా గ్రామపంచాయతీలో ఉన్నట్లే ఏటా రూ.5వేల నుంచి రూ.12 వేలు మాత్రమే ట్యాక్స్ వేస్తున్నారు.
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమై ఐదేళ్లు దాటినా కమర్షియల్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి ఇంకా గ్రామపంచాయతీ నాటి ఆస్తి పన్నునే వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. బల్దియా సిబ్బంది రీఅసెస్మెంట్ చేయకపోవడంతో కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేగాక ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు, అసెస్మెంట్ లో కొందరు రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ చివర్లో ఫిబ్రవరి, మార్చిలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి.
విలీనమైనా పంచాయతీ పన్నులే..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జూన్‌లో పద్మా నగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, అలుగునూరు, సదాశివపల్లి గ్రామాలను విలీనం చేశారు. ఈ గ్రామాల్లో మూడేళ్ల వరకు పన్నులు పెంచకుండా అప్పట్లో ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదు. మూడేళ్ల తర్వాత కమర్షియల్ బిల్డింగ్స్‌ను అయినా రీఅసెస్ మెంట్ చేయాల్సి ఉండగా పట్టించుకోలేదు. నిరుడు జూన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ బల్దియాపై నిర్వహించిన రివ్యూలో సిటీలో ఇలాంటి అసెస్మెంట్ కాని, పర్మిషన్ లేని బిల్డింగ్స్ వివరాలు సేకరించి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం 950 నిర్మాణాలను గుర్తించి రీఅసెస్ మెంట్ చేయగా.. సుమారు రూ.5 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ కొత్తగా జనరేట్ అయ్యింది.
కమర్షియల్ బిల్డింగ్స్‌కు రెసిడెన్షియల్ ట్యాక్స్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుమారు 83 వేల అసెస్మెంట్స్ ఉన్నాయి. ఇందులో వేలాది బిల్డింగ్స్ రెసిడెన్షియల్ కమ్ నాన్ రెసిడెన్షియల్ గా, మరికొన్నింటిని పూర్తి నాన్ రెసిడెన్షియల్ వినియోగిస్తున్నారు. కొందరు బిల్డింగ్స్ నిర్మాణ సమయంలో నివాస గృహాలుగా అనుమతులు తీసుకుని ఆ తర్వాత విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. కానీ వాటిని మున్సిపల్ రికార్డుల్లో నాన్ రెసిడెన్షియల్‌గా మార్చకపోవడంతో రెసిడెన్షియల్ ట్యాక్సే వస్తోంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.