హయత్ నగర్లో ఎంబీబీఎస్ ​సీట్ల పేరిట కోటి వసూలు..

  హయత్ నగర్లో ఎంబీబీఎస్ ​సీట్ల పేరిట కోటి వసూలు..

ఎల్బీనగర్, వెలుగు: ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీల నాయకుల పేర్లు చెబుతూ ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని, అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హయత్ నగర్ డిఫెన్స్ కాలనీకి చెందిన చంద్రకాంత్ గౌడ్(37) అలియాస్ టింకూ బాయ్ ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి, కొంతమంది స్టూడెంట్ల పేరెంట్స్ వద్ద సుమారు రూ.కోటి వరకు వసూల్ చేశాడు. 

సీట్లు ఇప్పించకపోవడంతో కొద్ది కాలంగా చంద్రకాంత్ ను బాధితులు నిలదీస్తున్నారు. ఎన్నిసార్లు ప్రశ్నించిన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తనకు అధికార పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని బెదిరించేవాడు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను కూడా బాధితులకు చూపించాడు. దీంతో బాధితుల ఫిర్యాదుతో హయత్ నగర్ పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. 

ఇంజినీరింగ్ సీట్లంటూ మరో ఇద్దరు

మేడిపల్లి : మేనేజ్ మెంట్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి, డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులను మేడిపల్లి పోలీసులు రిమాండ్ కు తరలించారు. మహబూబాబాద్ కు చెందిని బానోతు రవి, ఎల్బీనగర్ కు చెందిన మంగీలాల్ కలిసి పీర్జాదిగూడకు చెందిన మాచర్ల రాము, బాగు స్వామి, చిర్రగోని నరేశ్ ను కలిశారు. వారి కొడుకులకు ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి, నకిలీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ కాపి చూపించారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.6.50 లక్షలు తీసుకున్నారు. తీరా ఆ పత్రాలు నకిలీవి అని తెలియడంతో బాధితులు సోమవారం మేడిపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేసి  రిమాండ్ కు తరలించగా, వీరిద్దరికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.