సీఎంఆర్‌‌ సగమైనా పూర్తికాలే.. డిసెంబర్‌‌ 31తోనే ముగిసిన సేకరణ గడువు

సీఎంఆర్‌‌ సగమైనా పూర్తికాలే.. డిసెంబర్‌‌ 31తోనే ముగిసిన సేకరణ గడువు
  •     యాసంగికి సంబంధించి 39 శాతం బియ్యం అప్పగించిన మిల్లర్లు
  •     గత వానాకాలానికి చెందిన 4 వేల టన్నులు పెండింగ్‌‌
  •     ఈ నెల 19లోపు టార్గెట్‌‌ చేరుకోవాలని కలెక్టర్‌‌ ఆదేశం 

జనగామ, వెలుగు : కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌ సేకరణ ప్రతీ సంవత్సరం ఆలస్యం అవుతూనే ఉంది. రైస్‌‌ను ఇన్‌‌టైంలో ఇవ్వాలని ఆఫీసర్లు ఎంత ఒత్తిడి తెచ్చినా మిల్లర్లు పక్కా ప్లాన్‌‌తో ఉద్దేశపూర్వకంగానే లేట్‌‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లకు ఇచ్చిన గడువు డిసెంబర్‌‌ 31తోనే ముగిసింది. అయినా మిల్లర్లు టార్గెట్‌‌ మేరకు రైస్‌‌ ఇవ్వకపోవడంతో జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య ఇటీవల మిల్లుల్లో వరుస తనిఖీలు చేపట్టారు. మరో వారం రోజుల్లో మొత్తం రైస్‌‌ అప్పగించాలని మిల్లర్లను, ఆఫీసర్లను ఆదేశించారు. కానీ ఈ గడువులోపు కూడా టార్గెట్‌‌ రీచ్‌‌ కావడం కష్టంగానే మారింది.

39 శాతం బియ్యమే ఇచ్చిన్రు

ఒక సీజన్‌‌లో ఇవ్వాల్సిన రైస్‌‌ను మరో సీజన్‌‌ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ బియ్యంతో మిల్లర్లు సొంత బిజినెస్‌‌ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్‌‌ ముగిసినా గత వానాకాలానికి సంబంధించిన బియ్యాన్నే ఇప్పటివరకు అప్పగించలేదు.

జనగామ జిల్లాలో 50 రైస్‌‌ మిల్లులు కలిపి మొత్తం 74,691 టన్నుల రైస్‌‌ను సర్కార్‌‌కు అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 70,340 టన్నులు ఇవ్వగా ఇంకా 4 వేల టన్నులకు పైచిలుకు రైస్‌‌ పెండింగ్‌‌లోనే ఉంది. అలాగే యాసంగి సీజన్‌‌కు సంబంధించిన సీఎంఆర్‌‌ సేకరణ గడువు డిసెంబర్‌‌ 31తో ముగిసింది. జిల్లాలోని 55 మిల్లుల నుంచి 94,545 టన్నుల రైస్‌‌ అందాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 39 శాతం అంటే 37,621 టన్నుల రైస్‌‌ మాత్రమే ఇచ్చారు.

ఒక సీజన్‌‌ రైస్‌‌ మరో సీజన్‌‌లో...

మిల్లులకు వడ్ల రాక పెరగడాన్ని మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇచ్చిన గడువులోగా సీఎంఆర్‌‌ను అప్పగించాలని ఆఫీసర్లు ఎన్నిసార్లు చెప్పినా మిల్లర్లు పట్టించుకోవడం లేదు. వడ్లను నిల్వ చేసేందుకు గోడౌన్లు, మిల్లింగ్‌‌ చేసేందుకు మిల్లుల కెపాసిటీ చాలడం లేదంటూ బియ్యం అప్పగించకుండా ఆలస్యం చేస్తున్నారు.

కానీ ఒక సీజన్‌‌కు సంబంధించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకొని మరో సీజన్‌‌కు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ప్రతీ సీజన్‌‌లోనూ ఇలాగే దందా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సీఎంఆర్‌‌ ఆలస్యం అవుతుండడాన్ని గమనించిన కలెక్టర్‌‌ ఇటీవల వరుసగా మిల్లులను తనిఖీ చేస్తున్నారు. ఈ నెల 19 లోగా మొత్తం బియ్యం అప్పగించాలని ఆదేశించారు. కానీ అప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో అప్పగించడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సేకరణ స్పీడప్ చేస్తున్నం 

సీఎంఆర్‌‌ సేకరణను స్పీడప్‌‌ చేస్తున్నం. గత వానాకాలం సీజన్‌‌కు సంబంధించిన 95 శాతం, యాసంగికి సంబంధించి 39 శాతం సేకరణ పూర్తయింది. మిగిలిన బియ్యాన్ని త్వరగా అప్పగించాలని మిల్లర్లను ఆదేశించాం. 
-
  టీఎస్‌‌ఎన్‌‌. ప్రసాద్‌‌, సివిల్‌‌ సప్లై డీఎం, జనగామ