- రేపటి నుంచి ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల వివరాల సేకరణ
- వివరాలన్నీ యాప్‌లోని 30 కాలమ్స్‌లో ఎంట్రీ
- అప్లికేషన్లలో తప్పులు ఉంటే మార్పు చేసుకునేందుకు చాన్స్
- నెలపాటు కొనసాగనున్న ఆన్‌లైన్ ఎంట్రీ ప్రోగ్రాం
మహబూబ్‌నగర్, వెలుగు : ‘ఇందిరమ్మ ఇండ్లు’ కార్యక్రమంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం యాప్ తీసుకొచ్చి, అప్లికేషన్స్ అన్నింటినీ ఇందులో పొందుపర్చనున్నది. మొత్తం ఐదు విడతల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించేందుకు నిర్ణయించగా.. ఫేజ్ 1లో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధమైంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీలో పొలిటికల్ లీడర్లు జోక్యం చేసుకొని, భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడడంతో అనర్హులకు ఇండ్లు దక్కాయని ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పొలిటికల్ లీడర్ల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ‘ఇందిరమ్మ ఇండ్ల యాప్’ను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దీనిపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శనివారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. యాప్ లాగిన్ బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. వీరు సోమవారం నుంచి ఇంటింటికీ తిరిగి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయనున్నారు.
యాప్‌లో ‘‘ప్రజా పాలన’’ అప్లికేషన్స్ ఎంట్రీ
‘‘ప్రజా పాలన’’కు ఎక్కువగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్లను ఆదివారం రాత్రి వరకు ‘‘ఇందిరమ్మ ఇండ్ల’’ యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. సోమవారం నుంచి ఆయా ప్రాంతాల సెక్రటరీలు వీటి ఆధారంగా అప్లికేషన్స్‌ను వెరిఫై చేయనున్నారు. దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించనున్నారు. సొంత ఇంట్లో ఉంటున్నారా? కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారా? వంటి వాటికి సంబంధించి యాప్‌లో 30 కాలమ్స్‌ను సెక్రటరీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, ఆధార్, మొబైల్, రేషన్ కార్డు నంబర్, ఫొటో, ఖాళీ జాగా ఉంటే దాని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి.
‘‘ఇందిరమ్మ ఇండ్ల’’ మొదటి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తుండటంతో.. యాప్‌లో సొంత ఖాళీ జాగా ఫొటోను సెకట్రరీలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ స్థలం లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆన్‌లైన్‌లో ఎంట్రీ కానున్నాయి. ఈ జాగా చుట్టూ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయనే వివరాలు కూడా ఆన్‌లైన్‌లో ఎంట్రీ అవుతాయి. స్కీమ్ కింద బేస్ మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ ద్వారా మొత్తం4 విడతల్లో రూ.5 లక్షలు మంజూరు కానున్నాయి. ఈ నాలుగు దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేస్తేనే పేమెంట్ మంజూరు అవుతుంది. ఫొటోలు అప్లోడ్ చేయకుంటే బ్రేక్ పడుతుంది. అలాగే, ఒక చోట మంజూరు వచ్చి.. మరో చోట నిర్మాణం చేపట్టినా ల్యాంగిట్యూడ్, లాటిట్యూడ్లు మారి పేమెంట్లు కావు.
యాప్ ద్వారా కరెక్షన్స్
‘‘ప్రజా పాలన’’లో ఇండ్ల కోసం చేసుకున్న అప్లికేషన్స్‌లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా కల్పించింది. ఆధార్, ఫోన్ నంబర్, రేషన్ కార్డు నంబర్లు అప్లికేషన్స్‌లో తప్పుగా పడి ఉంటే.. వెరిఫికేషన్‌లో భాగంగా ఇండ్లకు వచ్చే పంచాయతీ సెక్రటరీలకు ఒరిజినల్ కాపీలను చూయించి, వాటిని సరి చేసుకోవచ్చు. ఇంటి పేర్లు, దరఖాస్తుదారుడి పేరు తప్పుగా నమోదైతే ఆధార్ ఆధారంగా పేర్లు, ఇంటి పేర్లను యాప్‌లో కరెక్షన్ చేసుకోవచ్చు.
పెండింగ్ నిర్మాణాల పూర్తికి చర్యలు
గత ప్రభుత్వం నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పెండింగ్‌లో పెట్టింది. కొన్ని చోట్ల ఇండ్లు మంజూరైనా నిర్మాణాలు ప్రారంభించలేదు. నిర్మాణాలు పూర్తి చేసిన వాటిని చాలా చోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లాలవారీగా అసంపూర్తిగా ఉన్న ఇండ్ల వివరాలు, నిర్మాణాలు, పూర్తి అయిన ఇండ్లు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులో ఉన్నాయి? అనే పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నది. అయితే, అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, వాటిని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.