ఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, విభేదాలు పక్కన పెట్టి ముందుకు సాగాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో మూడున్నర గంటల పాటు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. త్వరలో రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయ్ యాత్ర కోసం డొనేషన్స్ కలెక్ట్ చేయాలని, ఇందుకోసం ప్రచారాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా వద్దకు తీసుకెళ్లొద్దన్నారు. బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ,కాంగ్రెస్ ఇండియా కూటమి పై జరుగుతున్న దాడిని ప్రజలకు వివరించాల సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. పొత్తులపై కాంగ్రెస్ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఖర్గే వెల్లడించారు. ముందునుంచి పోల్ మేనేజ్మెంట్ పై జిల్లా స్థాయి నేతలు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు లేకుండా చూసుకోవాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.