కౌడిపల్లి మండలంలో ఉన్నతాధికారుల పేర్లతో డబ్బుల వసూలు!

కౌడిపల్లి మండలంలో ఉన్నతాధికారుల పేర్లతో డబ్బుల వసూలు!

కౌడిపల్లి, వెలుగు:  పంచాయతీరాజ్​ శాఖలో జిల్లా స్థాయి అధికారి అవినీతి భాగోతం మరుగున పడక ముందే కౌడిపల్లి మండలంలో ఓ అధికారి అవినీతి దందా సోమవారం వెలుగు చూసింది. ఉన్నతాధికారుల పేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ గ్రామస్థాయి అధికారుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వైనం బయటపడింది. మండల స్థాయి అధికారి ఒకరు ఇన్స్​ పెక్షన్​ల పేరుతో గ్రామాలకు వెళ్లి గ్రామస్థాయి అధికారుల నుంచి రూ.2 నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.  డబ్బులు నేరుగా తీసుకోకుండా ఫోన్​ పే, గుగుల్​ పే ద్వారా తన అకౌంట్​కు జమ చేయించుకుంటున్నట్టు సమాచారం.

కౌడిపల్లి మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉండగా నెలకు రూ.60 నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సదరు అధికారి గ్రామ అధికారులకు ఫోన్​ చేసి మీ ఊరిలో పనులు సక్రమంగా జరుగుతున్నాయా? రికార్డులు సరిగా రాస్తున్నారా? ఉన్నతాధికారులు ఇన్స్​ పెక్షన్​కు వస్తున్నారు అంటూ బయపెట్టి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని గ్రామస్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెబుతున్నారు.

ఏదైనా అత్యవసరం అయి, లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు సెలవు అడిగితే ఇవ్వకుండా జాబ్ కి రిజైన్ చెయ్..  లేదంటే పని మానేయ్​..  కానీ సెలవు మాత్రం ఇవ్వనంటూ బెదిరిస్తాడని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మహిళా అధికారులను టార్గెట్​ చేసి ఇబ్బందులు పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. సదరు అధికారి ఫోన్​ పే, గుగుల్​ పే చెక్​ చేస్తే అతడి అవినీతి భాగోతం బయటపడుతుందని బాధితులైన గ్రామస్థాయి అధికారులు చెబుతున్నారు.