ఆలస్యంగా తునికాకు సేకరణ!

ఆలస్యంగా తునికాకు సేకరణ!
  • సీజన్​ ముగుస్తున్నా కొన్ని కల్లాల్లోనే ఆకు తెంచుతున్నరు        
  • బోనస్​ కోసం కొందరు.. ధర కోసం మరికొందరు పట్టు

భద్రాచలం,వెలుగు :  అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో తునికాకు సేకరణ మందకొడిగా సాగుతోంది. సీజన్​ ముగుస్తున్నా కొన్ని కల్లాల్లో మాత్రమే ఆదివాసీలు ఆకును తెంచుడు మొదలుపెట్టారు. బోనస్​ కోసం కొందరు, ధర కోసం మరికొందరు పట్టుబట్టి తునికాకు సేకరణకు వెళ్లడం లేదు. ఇప్పటికే ఆన్​లైన్​ టెండర్ ప్రక్రియ, ఎండలు, ఎలక్షన్స్ కారణంగా ఆలస్యమైతే తాజాగా ఆదివాసీల మొండిపట్టుతో పలు చోట్ల ఆటంకంగా మారింది.

పక్క రాష్ట్రాల్లో 50 ఆకుల తునికాకు కట్ట ధర ఎక్కువగా ఉండటంతో బార్డర్​ విలేజ్​ల్లో ఆదివాసీలు అక్కడకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. జిల్లాలో 31 యూనిట్లలో 667 కల్లాల ద్వారా 35,100 స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించాలని టార్గెట్​పెట్టుకున్న అటవీశాఖకు ఆదివాసీలు చుక్కలు చూపిస్తున్నారు. 

ఎన్నో కారణాలు..

తునికాకు సేకరణ ఆలస్యం కావడానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని దేవరపల్లి యూనిట్​లో ఆదివాసీలు తమ తునికాకు బోనస్​ ఇచ్చేంత వరకు ఆకు కోయబోమని తెగేసి చెబుతున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2016 నుంచి 2021 వరకు 1,10,670 మంది తునికాకు కార్మికులకు ప్రభుత్వం రూ.75.79కోట్లను మంజూరు చేసింది. నేరుగా కార్మికుల ఖాతాల్లోనే జమ చేస్తామని అటవీశాఖ ప్రకటించింది. కానీ ఆర్​బీఐ నిబంధనల ప్రకారం ఎన్​పీసీఐ ( నేషనల్​ పేమెంట్స్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా) మ్యాపింగ్​ జరిగిన ఖాతాల్లోనే ఇవి జమ అవుతాయి.

కానీ ఒక్కో కార్మికుడికి2 నుంచి 3 బ్యాంకు ఖాతాలు ఉండటంతో చాలా చోట్ల జమ కాలేదు. ఇక తునికాకు కట్ట ధర విషయంలోనూ ఆదివాసీలు విభేదిస్తున్నారు. ఛత్తీస్​గఢ్​లో 50 ఆకుల తునికాకు కట్టకు రూ.5.50లు ఇస్తోంది. దీనికి కాంట్రాక్టర్​ కట్టకు మరో రూ.1.25లు కలిపి మొత్తంగా కట్టకు రూ.6.75లు ధర వస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 50 ఆకుల కట్టకు ఇచ్చే ధర రూ.3 మాత్రమే. కాంట్రాక్టర్​ ఇచ్చే రేటు ఇంకా ఖరారు కాలేదు. గత సంవత్సరం కూడా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఛత్తీస్​గఢ్​ బార్డర్​ విలేజ్​ల్లో ఆదివాసీలు తునికాకును అక్కడ అమ్ముకున్నారు. రేటు ఎక్కువగా వస్తుండటంతో తమ బంధువుల పేరుతో అమ్మేశారు.

ఈసారి కూడా అక్కడకే తీసుకెళ్తున్నారు. జిల్లాలో ఇల్లెందు, పాల్వంచ అభయారణ్యం, దుమ్ముగూడెం మండలంలో కొన్ని కల్లాల్లో మాత్రమే తునికాకు సేకరణ మొదలైనట్లుగా అటవీశాఖ రికార్డులు చెబుతున్నాయి. చాలా చోట్ల మందకొడిగానే సాగుతోంది. కొన్ని చోట్ల అసలు మొదలుపెట్టనే లేదు. ఇంకో వైపు వర్షాలు భయపెట్టిస్తున్నాయి. వర్షాలకు తునికాకు పాడైపోతుంది. ఆకులపై మచ్చలు వచ్చి పనికిరాకుండా మారుతాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈసారి తునికాకు సేకరణపై నీలినీడలు అలుముకున్నాయి.

బోనస్​ ఇవ్వాలి

ఆదివాసీలకు బోనస్​ ఇవ్వడంలో అధికారులు ఫెయిలయ్యారు. వెంటనే అందరి ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే ధరకు కనీసం ఒక రూపాయి అయినా కలిపి కాంట్రాక్టరు ఇవ్వాలి. అప్పుడే ఆదివాసీలకు లాభం. లేకుంటే కష్టమే.

కారం పుల్లయ్య, గిరిజన సంఘం నాయకుడు

ఆలస్యం వాస్తవమే

తునికాకు సేకరణ ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఎండలకు తోడు, ఎలక్షన్లు కూడా తోడు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే సేకరణ మొదలైంది. చాలా చోట్ల రేటు పెంచాలని, బోనస్​ కావాలని ఆదివాసీలు డిమాండ్​ చేస్తున్నారు. 

 కనకమ్మ, రేంజర్, దుమ్ముగూడెం