ప్రతి ఇల్లీగల్ బిజినెస్ కు ఒక రేటు
గద్వాల, వెలుగు: జోగలాంబ గద్వాల జిల్లా బార్డర్ పోలీస్‌స్టేషన్‌లో వసూళ్ల దంగా జోరుగా సాగుతోంది. కర్నాటక, తెలంగాణ బార్డర్ దాటేందుకు ప్రతి ఇల్లీగల్బిజినెస్కు ఇంత రేటంటూ ఫిక్స్చేశారు. ప్రతి నెలా రూ. 20 లక్షల వరకు జేబులో వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింగ్ మేకర్ గా ఓ కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పై ఆఫీసర్ కు 70 శాతం, 30 శాతం ఆయన జేబులో వేసుకుంటూ మిగతా సిబ్బందికి ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. జిల్లాలోని కర్నాటక బార్డర్ ను ఆనుకొని ఉన్న మండలంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ గతం నుంచీ కొనసాగుతున్నాయి. పీడీఎస్బియ్యం అక్రమ రవాణాకు ఇక్కడ పెట్టింది పేరు. ఈ మండలంలో 19 బొలెరో వెహికల్స్పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నాయి. ఒక్కో వెహికల్ నెలకు రూ. 30 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 9 పొట్టు లారీలు కర్నాటక నుంచి గద్వాలకు తిరుగుతుంటాయి. ఓవర్ లోడు ట్రాఫిక్ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో తరచూ వేధించకుండా ఉండేందుకు ఆ వెహికల్ ఓనర్స్ నెలకు ఒక్కొక్క లారీకి రూ. పది వేలు, నందిన్నే గ్రామంలో కల్లు షాపు పక్కన పేకాట ఆడించేందుకు నెలకు రూ. పది వేల చొప్పున ఇస్తున్నారని పలువురు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇక కర్నాటక వాగు, గువ్వలదిన్నె వాగు నుంచి ఏడు ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. వాటిలో నాలుగు కర్నాటకకు చెందిన వాళ్లవి కాగా, మూడు లోకల్ వాళ్లని. వాళ్ల బిజినెస్ కొనసాగడానికి ఒక్కో ట్రాక్టర్ కు నెలకు రూ. పది వేలు ఇస్తున్నారని, అందుకే రాత్రి, పగలు తేడా లేకుండా దందా కొనసాగిస్తున్నారని గువ్వలదిన్నే గ్రామస్థులు పేర్కొంటున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతాయని, తమ పొలాలు దెబ్బతింటాయని ట్రాక్టర్లు తిరగకుండా రైతులు అడ్డుకున్నా పోలీసులు పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేసే అందరి దగ్గర కలిపి నెలకు సుమారు రూ. 20 లక్షల పైగా వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీస్‌స్టేషన్‌లో కోల్డ్ వార్
అక్రమ వ్యాపారాల విషయంలో ఓ పోలీస్కానిస్టేబుల్ కింగ్‌మేకర్‌గా వ్యవహరిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో ఏ పని కావాలన్నా.. ఇల్లీగల్ గా బిజినెస్ చేయాలన్నా ఆ కానిస్టేబుల్ కలిస్తే చాలు. అయితే ప్రతినెల డబ్బులు పంపకపోతే ఆ వెహికల్ మరుసటి రోజే సీజ్ అయిపోతుంది. వచ్చిన ఇల్లీగల్ డబ్బు మొత్తం సిబ్బందికి పంచకుండా కేవలం ఇద్దరు మాత్రమే తీసుకోవడంతో పోలీస్ స్టేషన్ లో ముసలం మొదలైంది. సీనియర్లను పక్కనపెట్టి ఒక జూనియర్ కానిస్టేబుల్ అంతా తానై వ్యవహరిస్తుండడంతో పోలీస్ స్టేషన్ లో కోల్డ్ వార్ నడుస్తోంది. కొందరు ఆ పోలీస్ స్టేషన్ లో పని చేయలేక వేరే పోలీస్ స్టేషన్ లకు అటాచ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఇప్పటివరకు ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లు అటాచ్ చేయించుకున్నారని సమాచారం.
గుట్కాలు, లిక్కర్ కు సప‘రేటు’
తెలంగాణలో గుట్కాలపై నిషేధం ఉండడంతో కర్నాటక నుంచి అక్రమంగా ప్రతిరోజు బైకులు, కార్లలో తరలిస్తున్నారు. వీరి నుంచి సపరేట్ గా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా కర్నాటక లిక్కర్ కూడా పెద్దఎత్తున ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం పాతపాలెం విలేజ్ లో కర్నాటక లిక్కర్ ను జిల్లా టాస్క్ ఫోర్స్ టీం దాడి చేసి పట్టుకుంది. దాదాపు 70 వేల లిక్కర్, ఒక వెహికల్ సీజ్ చేశారు. నిందితులకు వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నెల క్రితం డీసీఎం గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 50కి పైగా జీవాలు చనిపోయాయి. బాధితునికి న్యాయం చేయాల్సింది పోయి డీసీఎం వెహికల్ ఓనర్ నుంచి లక్ష రూపాయలు తీసుకొని కేసు తారుమారు చేశారనే ఆరోపణలున్నాయి. పేరుకు చెప్పుకోవడానికి మాత్రమే పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో వెహికల్స్ పోతుంటే అప్పుడప్పుడు ఒకటి రెండు వెహికల్స్మాత్రమే పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మిగతా వెహికల్స్‌ను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు.